Share News

Kapil Dev: భారత క్రికెట్‌ను నిలబెట్టిన ధీరుడు.. హ్యాపీ బర్త్‌డే పాజీ!

ABN , Publish Date - Jan 06 , 2026 | 01:04 PM

భారత క్రికెట్ ప్రస్థానంలో అతనో సంచలనం.. అతడి కెప్టెన్సీ ఓ చరిత్ర.. అతని ఆల్‌రౌండ్ ప్రదర్శన అమోఘం! ఎవరో అర్థమయ్యే ఉంటుందిగా..! ది లెజెండ్ ఆఫ్ ఆల్ టైం ‘కపిల్ దేవ్’. ‘1983 ప్రపంచ కప్ భారత్ గెలిచింది’ అనే కన్నా.. ‘కపిల్ దేవ్ గెలిపించాడు’ అనడంలో అతిశయోక్తే లేదు. భారత క్రికెట్‌కు ఆయువు పోసి బతికించిన ఘనత అతడికే దక్కుతుంది.. హ్యాపీ బర్త్ డే పాజీ!

Kapil Dev: భారత క్రికెట్‌ను నిలబెట్టిన ధీరుడు.. హ్యాపీ బర్త్‌డే పాజీ!
Kapil Dev

ఇంటర్నెట్ డెస్క్: 356 అంతర్జాతీయ మ్యాచులు.. 9038 పరుగులు.. 687 వికెట్లు.. మరీ ముఖ్యంగా నిలబడటం కూడా తెలియని ‘భారత్ క్రికెట్’ను పరుగులు పెట్టించిన ధీరుడు. 1983 ప్రపంచ కప్‌ను సగర్వంగా టీమిండియా ముద్దాడేలా చేసిన ఘనడు.. భారత క్రికెట్ ప్రస్థానంలో అతనో సంచలనం.. అతడి కెప్టెన్సీ ఓ చరిత్ర.. అతని ఆల్‌రౌండ్ ప్రదర్శన అమోఘం! ఎవరో అర్థమయ్యే ఉంటుందిగా..! ది లెజెండ్ ఆఫ్ ఆల్ టైం ‘కపిల్ దేవ్’. ‘1983 ప్రపంచ కప్ భారత్ గెలిచింది’ అనే కన్నా.. ‘కపిల్ దేవ్ గెలిపించాడు’ అనడంలో అతిశయోక్తే లేదు. విండీస్‌తో జరిగిన నాటి ఫైనల్లో వివ్ రిచర్డ్స్ క్యాచ్‌ను ఒడిసి పట్టిన తీరును క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరవలేరు.


ఆటగాళ్లకు కనీసం బూట్లు కూడా కొనివ్వలేని దయనీయ స్థితిలో ఉన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. నేడు యావత్‌ క్రికెట్‌ ప్రపంచాన్ని శాసిస్తోందన్నా.. మన దేశంలో క్రికెట్‌ ఓ ఆటగా కాకుండా మతంలా మారిందన్నా.. దానికి కారణం ఈ 1983 ప్రపంచకప్ విజయమే! ఈ అపూర్వ విజయాన్నందించిన కపిల్ దేవ్(Kapil Dev) నేడు(జనవరి 6) 66వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు.


పాకిస్తాన్‌లో పుట్టి..

టీమిండియా కెప్టెన్‌గా భారత క్రికెట్ గతిని మార్చిన కపిల్ దేవ్.. పాకిస్తాన్‌లోని రావల్పిండి సమీపంలోని ఓ గ్రామంలో 1959 జనవరి 6న జన్మించాడు. దేశ విభజన సమయంలో వారి కుటుంబం భారత్‌కు వ‌ల‌స వ‌చ్చి చంఢీగడ్‌లో స్థిరపడింది. తండ్రి రాంలాల్ భవనాలకు సంబంధించిన కలప వ్యాపారం చేసేవాడు. డి.ఏ.వి.కళాశాలలో విద్యనభ్యసించిన కపిల్ దేవ్‌కు 1979లో రోమీ భాటియాతో పరిచయం అయింది. 1980లో ఆమెను వివాహం చేసుకున్నాడు. 1996లో కపిల్ దంపతులకు అమియాదేవ్ అనే కూతురు జ‌న్మించింది.


ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో..

దేశ‌వాళీ క్రికెట్‌లో అద‌రగొట్టిన క‌పిల్ దేవ్ 1978లో భార‌త జ‌ట్టులో అడుగుపెట్టాడు. అక్టోబ‌ర్ 1న పాకిస్తాన్‌తో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్ ద్వారా అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అదే నెల‌లో 16న‌ పాకిస్తాన్‌తో తన కెరీర్‌లో తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. అక్కడి నుంచి భార‌త క్రికెట్ జ‌ట్టులో మంచి పేస్ ఆల్‌రౌండ‌ర్‌గా స్థిర‌ప‌డిపోయాడు. క‌రాచీలో జ‌రిగిన ఆ సిరీస్‌లోని మూడో టెస్టులో 33 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు. త‌ద్వారా టెస్టు క్రికెట్‌లో వేగంగా హాఫ్ సెంచ‌రీ సాధించిన భార‌త బ్యాట‌ర్‌గా రికార్డు సృష్టించాడు. వెస్టీండీస్ జట్టుపై ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో 124 బంతుల్లోనే 126 పరుగులు త‌న‌ కెరీర్‌లో తొలి టెస్ట్ శతకాన్ని సాధించాడు.


భారత్.. విశ్వవిజేత

1983 ప్రపంచ‌ క‌ప్‌లో భార‌త్‌కు నాయ‌కత్వం వ‌హించిన కపిల్‌ దేవ్ జ‌ట్టును విశ్వ విజేత‌గా నిలిపాడు. భార‌త్‌కు తొలి ప్రపంచ కప్ అందిచ‌డంతోపాటు వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నమెంట్‌ల‌లో వెస్టిండీస్ వ‌రుస విజ‌యాల‌కు బ్రేక్ వేశాడు. నాడు క‌పిల్‌దేవ్ నాయ‌క‌త్వంలో భార‌త జ‌ట్టు సాధించిన విజ‌యంతో దేశంలో క్రికెట్ ద‌శ మారిపోయింది. యువ‌త క్రికెట్ ప‌ట్ల అమిత‌మైన ఆస‌క్తి పెంచుకున్నారు.


కపిల్ ట్రాక్ రికార్డ్..

కపిల్ దేవ్ 1994లో అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రక‌టించాడు. త‌న చివ‌రి టెస్టు మ్యాచ్‌ను 1994లో మార్చి 19న న్యూజిలాండ్‌తో ఆడాడు. ఇక చివ‌రి వ‌న్డే మ్యాచ్‌ను 1994 అక్టోబ‌ర్ 17న వెస్టిండీస్‌తో ఆడాడు. మొత్తంగా త‌న టెస్టు కెరీర్‌లో 131 టెస్టు మ్యాచ్‌లు ఆడి 31 స‌గ‌టుతో 5248 ప‌రుగులు చేశాడు. ఇందులో 8 సెంచ‌రీలు, 27 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఈ క్రమంలో టెస్టు క్రికెట్‌లో 5 వేల ప‌రుగులు చేయడంతో 400కు పైగా వికెట్లు ప‌డ‌గొట్టిన తొలి ఆల్‌రౌండ‌ర్‌గా క‌పిల్ దేవ్ చెర‌గ‌ని రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా వ‌న్డే క్రికెట్‌లో భార‌త జ‌ట్టు త‌ర‌ఫున సెంచ‌రీ న‌మోదు చేసిన తొలి ఆట‌గాడిగా నిలిచాడు. మొత్తం 17 సంవ‌త్సరాల‌పాటు భార‌త క్రికెట్‌కు కపిల్ దేవ్ ఎనలేని సేవ చేశాడు. భారత క్రికెట్‌కు ఆయువు పోసి బతికించిన ఘనత అతడికే దక్కుతుంది.. హ్యాపీ బర్త్ డే పాజీ!


ఇవి కూడా చదవండి:

సిరాజ్ దురదృష్టవంతుడు.. ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు

సూర్యా.. పరుగుల గురించి మాత్రమే ఆలోచించు: రికీ పాంటింగ్

Updated Date - Jan 06 , 2026 | 03:41 PM