ఇరగదీసిన ఇషాన్.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?
ABN , Publish Date - Mar 28 , 2026 | 09:58 PM
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో ఆర్సీబీతో పోరులో సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. దీంతో ఆర్సీబీ ముందు 202 లక్ష్యాన్ని ఉంచింది.
ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ప్రారంభ హై ఓల్టేజీ మ్యాచ్‌లో ఆర్సీబీతో పోరులో సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకోగా.. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ 29/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్ కేవలం 27 బంతుల్లోనే అద్భుతమైన అర్ధశతకంతో(80; 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సులు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఇరగదీశాడు. ఇదే క్రమంలో సెంచరీ వైపునకు దూసుకెళ్తున్న తరుణంలో అభినందన్ సింగ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి బౌండరీ లైన్ వద్ద ఫిల్ సాల్ట్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు వెనుదిరిగాడు.
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు దారుణంగా విఫలమయ్యారు. అభిషేక్ శర్మ (7; 8 బంతుల్లో 1 సిక్స్), ట్రావిస్ హెడ్ (11; 9 బంతుల్లో 2 ఫోర్లు), వన్‌డౌన్ బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి(1)లను ఆర్సీబీ బౌలర్ జాకబ్ డఫీ పెవిలియన్ చేర్చాడు. దీంతో 29 పరుగులకే 3 వికెట్లతో కష్టాల్లో పడింది. అప్పుడు బ్యాటింగ్‌కు దిగిన ఇషాన్, హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన బ్యాటింగ్‌తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో క్లాసెన్(31; 22 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు బ్యాట్ ఝలిపించినప్పటికీ రొమారియో షెఫర్డ్ అతణ్ని పెవిలియన్ బాటపట్టించాడు. ఆ తర్వాత వచ్చిన సలీల్ ఆరోరా(9), హర్ష్ దూబె (3), హర్షల్ పటేల్ కూడా విఫలమయ్యారు. చివర్లో అనికేత్ వర్మ (43; 18 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సులు) చెలరేగి ఆడటంతో ఎస్ఆర్‌హెచ్ 200 మార్క్‌ను దాటింది. ఆర్సీబీ బౌలర్లలో డఫీ, షెఫర్డ్ చెరో 3 వికెట్లతో రాణించారు. భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, సుయాష్ శర్మ తలో వికెట్ తీశారు.
ఇక.. సన్‌రైజర్స్ తాత్కాలిక సారథి ఇషాన్ కిషన్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో ఎస్ఆర్‌హెచ్ తరఫున కెప్టెన్సీ అరంగేట్రంలోనే అత్యధిక స్కోర్ సాధించిన ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డ్ మనీశ్ పాండే(69 నాటౌట్) పేరిట ఉండేది. ఈ ఇన్నింగ్స్‌తో ఇషాన్ మరో ఘనతనూ సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ కెప్టెన్సీ అరంగేట్రంలోనే అత్యధిక స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో 6వ స్థానం సాధించాడు.
ఐపీఎల్ కెప్టెన్సీ అరంగేట్రంలో అత్యధిక స్కోర్లు:
119 - సంజు శాంసన్ (RR) vs PBKS - 2021
99* - మయాంక్ అగర్వాల్ (PBKS) vs DC - 2021
93* - శ్రేయస్ అయ్యర్ (DC) vs KKR - 2018
88 - ఫాఫ్ డుప్లెసిస్ (RCB) vs PBKS - 2022
83 - కీరన్ పొలార్డ్ (MI) vs PBKS - 2019
80 - ఇషాన్ కిషన్ (SRH) vs RCB - 2026*
ఇవీ చదవండి:
పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!
గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు