ఫుట్‌బాల్ వరల్డ్ కప్ 2026లో పాల్గొనం: ఇరాన్
ABN , Publish Date - Mar 12 , 2026 | 10:51 AM
అమెరికాలో జరగబోయే పురుషుల ఫుట్‌బాల్ ప్రపంచకప్2026లో పాల్గొనబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ప్రస్తుతం తమ దేశంపై దాడులు చేస్తున్న అమెరికా... అక్కడికెళ్లే తమ జట్టుకు హాని చేయకుండా ఉండదని ఇరాన్ ఆరోపించింది.
స్పోర్ట్స్ డెస్క్: ప్రస్తుతం అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీని ప్రభావం క్రీడా ప్రపంచంపై కూడా పడింది. ఇప్పటికే క్రికెట్‌కు సంబంధించి పలు సిరీస్‌లు రద్దయ్యాయి. తాజాగా ఇరాన్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాలో జరగబోయే పురుషుల ఫుట్‌బాల్ ప్రపంచకప్2026లో పాల్గొనబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు ఉమ్మడిగా ఈ జూన్, జులైల్లో ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వనున్నాయి.
ప్రస్తుతం తమ దేశం మీదపడి దాడులు చేస్తున్న అమెరికా... అక్కడికెళ్లే తమ ఆటగాళ్లకు హాని చేసే అవకాశం ఉందని ఇరాన్ ఆరోపించింది. తమపై అత్యంత క్రూరంగా అమెరికా ప్రవర్తిస్తోందని, గడిచిన ఎనిమిది, తొమ్మిది నెలల్లోనే రెండోసారి తమపై యుద్ధం చేస్తోందని ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమపై దాడి చేసి వేల సంఖ్యలో ప్రజల ఉసురు తీస్తోందని, ఇలాంటి దేశానికి వెళ్లి తాము ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడే పరిస్థితి ఉంటుందా? అని ఇరాన్ ప్రశ్నించింది.
అమెరికాలో ప్రపంచ కప్ ఆడే ప్రసక్తే లేదని ఇరాన్ క్రీడల మంత్రి అహ్మద్ దొన్యమలి ఓ టీవీ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. దీంతో అధికారికంగా అమెరికా ఆతిథ్యమిచ్చే ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను ఇరాన్ బహిష్కరించనుందని స్పష్టమైంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఫుట్‌బాల్ ప్రపంచ కప్2026లో ఇరాన్ బహిష్కరణ వాఖ్యల్ని బేఖాతరు చేస్తూ తేలిగ్గా కొట్టి పారేశారు.
ఇవి కూడా చదవండి:
హార్దిక్ పాండ్యాపై ఫిర్యాదు.. జాతీయ జెండాను అవమానించాడంటూ..
ఆరంభ పోరులో.. బెంగళూరు, హైదరాబాద్ ఢీ