Share News

IPL: ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. ఖండించిన టీమిండియా మాజీ క్రికెటర్

ABN , Publish Date - Jan 19 , 2026 | 03:39 PM

రానున్న మార్చిలో ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ తీవ్రంగా ఖండించాడు. ఫిక్సింగ్ చేయడం అసాధ్యమని వెల్లడించాడు.

IPL: ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. ఖండించిన టీమిండియా మాజీ క్రికెటర్
IPL

ఇంటర్నెట్ డెస్క్: మ్యాచ్ ఫిక్సింగ్.. ఐపీఎల్ నడుస్తున్నంత కాలం అభిమానుల చర్చల్లో ఎక్కువగా వినిపించే మాట ఇది. రానున్న మార్చిలో ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్(Parthiv Patel) తీవ్రంగా ఖండించాడు. ఫిక్సింగ్ చేయడం అసాధ్యమని వెల్లడించాడు.


‘ఐపీఎల్‌(IPL)లో ఒక్క మ్యాచ్ కూడా ఫిక్స్ కాలేదు. మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందో ముందే తెలియడం అనేది ఉండదు. అది సాధ్యమని నేను అనుకోవడం లేదు. ఫోన్లు, ఈ-మెయిల్స్, హోటల్‌లోకి ఎవరు వస్తున్నారు? ఎవరు వెళ్తున్నారు? ఇలా అన్నీ రికార్డ్ అవుతాయి. చాలా కట్టుదిట్టంగా భద్రత ఏర్పాటు చేస్తారు. కెప్టెన్‌ సహా ప్రతి ఒక్కరికీ అక్రిడేషన్ అవసరం. కెప్టెన్‌కు అక్రిడేషన్ లేకపోయినా అతడిని మైదానం, డ్రెస్సింగ్ రూంలోకి అనుమతించరు. ఒక్క ఐపీఎల్ అనే కాదు.. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ఫిక్సింగ్ జరిగిందని జనాలు తేలికగా నిందలు వేస్తారు. కానీ వాటిని నిరూపించడమే కష్టం’ అని పార్థివ్ వివరించాడు.


ఐపీఎల్ 2013లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీని ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లను ఐపీఎల్ నుంచి రెండు సీజన్ల పాటు సస్పెండ్ చేశారు. కాగా.. పార్థివ్ పటేల్ గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.


ఇవి కూడా చదవండి:

రో-కో మళ్లీ బరిలోకి దిగేదెప్పుడంటే.?

అన్నిసార్లూ భారీ స్కోర్లు చేయడం సాధ్యపడదు.. రోహిత్ ఫామ్‌పై గిల్ స్పందనిదే..

Updated Date - Jan 19 , 2026 | 04:30 PM