Share News

ప్రపంచ రోయింగ్ కప్: భారత్‌కు స్వర్ణం

ABN , Publish Date - Jun 28 , 2026 | 05:02 PM

భారత రోయింగ్ చరిత్రలో ఎన్నడూ లేని ఘనత నమోదైంది. స్విట్జర్లాండ్‌ వేదికగా జరుగుతున్న 2026 వరల్డ్ రోయింగ్ కప్-3లో భారత ఆర్మీకి చెందిన లక్ష్య, ఉజ్వల్ కుమార్ సింగ్ స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించారు.

ప్రపంచ రోయింగ్ కప్: భారత్‌కు స్వర్ణం
India Rowing

ఇంటర్నెట్ డెస్క్: భారత రోయింగ్ చరిత్రలో ఎన్నడూ లేని ఘనత నమోదైంది. స్విట్జర్లాండ్‌ వేదికగా జరుగుతున్న 2026 వరల్డ్ రోయింగ్ కప్-3లో భారత ఆర్మీకి చెందిన లక్ష్య, ఉజ్వల్ కుమార్ సింగ్ స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించారు. ప్రపంచ రోయింగ్ కప్ చరిత్రలోనే భారత్‌కు ఇది తొలి స్వర్ణం కావడం విశేషం. లైట్‌ వెయిట్‌ మెన్స్‌ డబుల్ స్కల్స్ ఫైనల్‌లో భారత్ జోడీ 6:26.09 నిమిషాల్లో రేస్‌ను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. హాంకాంగ్‌ (6:27.14), నెదర్లాండ్స్ (6:27.36) తర్వాత స్థానాల్లో నిలిచాయి. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలో భారత జోడీ ఆధిక్యాన్ని నిలబెట్టుకుని చారిత్రక విజయాన్ని అందుకుంది.


భారత రోయింగ్‌లో కొత్త అధ్యాయం

ప్రపంచ రోయింగ్‌ కప్‌ సిరీస్‌లో భారత్‌ ఇప్పటివరకు స్వర్ణ పతకం గెలవలేదు. ప్రపంచ రోయింగ్‌ ఛాంపియన్‌షిప్‌కు ముందు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ టోర్నీలో తొలి గోల్డ్‌ సాధించడం భారత రోయింగ్‌కు మైలురాయిగా నిలిచింది. ఈ విజయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. స్వర్ణం సాధించిన లక్షయ్, ఉజ్వల్‌ ఇద్దరూ భారత ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న సైనికులే. ఈ టోర్నీలో పోటీపడుతున్న 18 మంది భారత బృందంలో 17 మంది ఆర్మీకి చెందిన వారే కావడం గమనార్హం. మరొకరు నేవీకి చెందిన అథ్లెట్. ఈ సీజన్‌లో వరల్డ్‌ రోయింగ్‌ కప్‌-1 విజేతలైన హాంకాంగ్‌కు చెందిన లామ్‌ సాన్‌ టుంగ్‌, చాన్‌ టిక్‌ లంగ్‌ జోడీతో పాటు ఇతర ప్రత్యర్థులను లక్షయ్-ఉజ్వల్‌ దీటుగా ఎదుర్కొన్నారు. ప్రారంభం నుంచే ఆధిక్యంలో కొనసాగిన భారత జోడీ ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొని గెలుపును సొంతం చేసుకుంది.


దేశానికి గర్వకారణం: ఆర్మీ

ఈ విజయంపై ఆర్మీ రోయింగ్‌ నోడ్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ కల్నల్‌ రామకృష్ణన్‌ హర్షం వ్యక్తం చేశారు. ‘భారత రోయింగ్‌ చరిత్రలో ఇది చిరస్మరణీయ ఘట్టం. వరల్డ్‌ రోయింగ్‌ కప్‌లో తొలి స్వర్ణ పతకం సాధించిన లక్షయ్, ఉజ్వల్‌ దేశ ప్రతిభను ప్రపంచానికి చాటారు. ఆర్మీ రోయింగ్‌ నోడ్‌లో సంవత్సరాలుగా అందించిన కఠిన శిక్షణ, క్రమశిక్షణకు ఇది నిదర్శనం. ఇది భారత ఆర్మీతో పాటు దేశానికే గర్వకారణం. ఈ విజయం మరెంతో మంది యువతను రోయింగ్‌వైపు ఆకర్షిస్తుందని, భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరిన్ని విజయాలు అందిస్తారని ఆశిస్తున్నాం" అని అన్నారు.


ఇవి కూడా చదవండి:

విరాట్‌తో కలిసి క్రికెట్ ఆడాలనుంది: టెన్నిస్ దిగ్గజం జకోవిచ్

ఫిఫా ప్రపంచ కప్ నుంచి ఇరాన్ ఔట్.. లాకర్ రూమ్‌లో మరో నోట్!

Updated Date - Jun 28 , 2026 | 05:15 PM