భారత్‌లో అత్యంత ప్రమాదకరంగా డోపింగ్ సమస్య.. ఏఐయూ కీలక ప్రకటన
ABN , Publish Date - Apr 20 , 2026 | 07:52 PM
భారత అథ్లెటిక్స్‌కు గట్టి షాక్ తగిలింది. డోపింగ్ ప్రమాదం అత్యంత ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలోకి భారత్ చేరిందని అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్(ఏఐయూ) కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు కేటగిరీ బిలో ఉన్న భారత్ కేటగిరీ ఏకి చేరిందని తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత అథ్లెటిక్స్‌కు గట్టి షాక్ తగిలింది. డోపింగ్ ప్రమాదం అత్యంత ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలోకి భారత్ చేరిందని అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్(ఏఐయూ) కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు కేటగిరీ బిలో ఉన్న భారత్ కేటగిరీ ఏకి చేరిందని తెలిపింది. ఇప్పటికే ఇదే కేటగిరీలో ఉన్న రష్యా, బెలారస్, ఇథియోపియా, కెన్యా, నైజీరియా, ఉక్రెయిన్ వంటి దేశాల సరసన తాజాగా భారత్ చేరింది. దీంతో ఇక నుంచి భారత అథ్లెట్లు మరింత కఠినమైన డోపింగ్ నిరోధక నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అథ్లెటిక్స్‌లో అత్యధిక డోపింగ్ ఉల్లంఘనల విషయంలో భారత్ గత మూడేళ్లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిందని ఏఐయూ తెలిపింది.
‘భారత్‌లో డోపింగ్ సమస్య అత్యంత ప్రమాదకరంగా ఉంది. డొమెస్టిక్ డోపింగ్ నిరోధక కార్యక్రమం డోపింగ్ ముప్పు స్థాయికి తగినట్లుగా లేదు. దేశంలో డోపింగ్ వ్యతిరేక సంస్కరణల కోసం అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఏఎఫ్ఐ) కృషి చేసినప్పటికీ తగినంత మార్పు రాలేదు. అథ్లెటిక్స్ సమగ్రతను పరిరక్షించే సంస్కరణలను సాధించేందుకు కేటగిరీ ఏలో ఉన్న ఇతర దేశాల ఫెడరేషన్‌లతో వ్యవహరించిన రీతిలోనే ఏఐయూ ఇప్పుడు ఏఎఫ్ఐతో కలిసి పనిచేస్తుంది’ అని ఏఐయూ ఛైర్మన్ డేవిడ్ హౌమన్ తెలిపారు. ఇక ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(వాడా) చీఫ్ విటోల్డ్ బాంకా ఇటీవల ఢిల్లీ పర్యటించారు. ఆయన కూడా భారత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నిషేధిత ఉత్ప్రేరకాలు, స్టెరాయిడ్ల ఉత్పత్తి భారత్‌లో అధికంగా ఉంది. ఇదొక తీవ్రమైన సమస్య. దీనిని ఎవరూ ఉపేక్షించడం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు జరుగుతున్న కృషి సత్ఫలితాలను ఇస్తుందని నమ్ముతున్నా’ అని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, ఇటీవల డోపింగ్ కేసులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఆసియా గేమ్స్ స్వర్ణ పతక విజేత ప్రథమేశ్ జాకర్‌పై రెండేళ్ల నిషేధం పడింది. ‘వేర్ అబౌట్స్ ఫెయిల్యూర్’ కారణంగా ఈ శిక్ష పడటంతో, అతడు జపాన్‌లో జరిగే ఆసియా క్రీడలకు దూరం కానున్నాడు. 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణతో పాటు 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం లక్ష్యంగా పెట్టుకున్న భారత్‌కు ఈ పరిణామం ఒక హెచ్చరికగా మారింది. క్రీడల ప్రతిష్ఠను కాపాడుకోవాలంటే డోపింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్
సిక్సర్ల పిడుగు వైభవ్ సూర్యవంశీ మళ్లీ ఏడ్చేశాడు.. వీడియో వైరల్