టైటిల్ గెలిచినప్పుడు కూడా ఇలాంటి దృశ్యాలు చూడలేదు: వరుణ్
ABN , Publish Date - Apr 20 , 2026 | 04:45 PM
ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయాల్లో బోణీ కొట్టింది. వారు ఆడిన ఏడో మ్యాచ్‌లో గెలవడంతో ఆ జట్టు సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఐదు మ్యాచుల ఓటమి తర్వాత నిన్నటి(ఆదివారం) మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఆ జట్టు సభ్యుల్లో భావోద్వేగానికి గురయ్యారు. డ్రెస్సింగ్ రూమ్‌లో దాదాపు ప్రతిఒక్కరూ కన్నీళ్లు పెట్టుకున్నారని మిస్టరీ స్పిన్నర్, కేకేఆర్ బౌలర్ వరుణ్ చక్రవర్తి వెల్లడించాడు. 2024లో ఛాంపియన్‌గా నిలిచిన సమయంలో కూడా ఇలాంటి దృశ్యాలను చూడలేదని తెలిపాడు.
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 155 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో కోల్‌కతా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. ఈ సీజన్‌లో కేకేఆర్‌కిదే తొలి గెలుపు కావడం విశేషం. ఈ మ్యాచ్ కంటే ముందు ఆడిన ఆరు మ్యాచులకు గాను ఐదింట్లో ఓడగా.. మరొక మ్యాచ్ వర్షం కారణగా రద్దైంది. మొత్తంగా ఏడో మ్యాచ్‌లో కేకేఆర్ జట్టు విజయకేతనం ఎగరేసింది. దీంతో జట్టులోని సభ్యులంతా ఎమోషనలయ్యారు.
మ్యాచ్ అనంతరం వరుణ్ చక్రవర్తి మీడియాతో మాట్లాడుతూ.. 'ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాక మా డ్రెస్సింగ్ రూమ్‌లో ఎన్నో కన్నీళ్లను చూశా. పదేళ్ల తర్వాత మేము 2024లో మూడోసారి ఛాంపియన్‌గా నిలిచాం. కానీ, ఆ సమయంలో కూడా ఇలాంటి దృశ్యాలు కనిపించలేదు. మా కోచింగ్ బృందానికే ఈ గెలుపు క్రెడిట్ దక్కుతుంది. బయట మాపై వస్తోన్న సెటైర్లు, విమర్శలను మా వరకు చేరకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. చాలామంది అర్ధరహితంగా మాపై నిందారోపణలు చేశారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో మాకు మద్దతుగా ఉన్న కేకేఆర్ మేనేజ్‌మెంట్‌కు కృతజ్ఞతలు. ఇప్పుడు విజయంతో మా అడుగు మొదలుపెట్టాం. రానున్న రోజుల్లో కూడా ఇదే కొనసాగుతుందని భావిస్తున్నా’ అని వరుణ్ చక్రవర్తి వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
కోహ్లీ, రోహిత్‌లకు కష్టమైనది.. ఈజీగా సాధించిన వైభవ్!
సరికొత్త అధ్యాయం.. టీ20 క్రికెట్ ఫ్రాంచైజీ సహ యజమానిగా క్రిస్ గేల్
బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఒకేసారి రెండు టీ20 జట్లు!