Share News

భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ రాజీనామా.. ఐపీఎల్‌లో చేరేందుకు సిద్ధం!

ABN , Publish Date - Jul 28 , 2026 | 05:25 PM

శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. భారత పురుషుల క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న ర్యాన్ టెన్ డస్కటే తన పదవికి రాజీనామా చేశారు.

భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ రాజీనామా.. ఐపీఎల్‌లో చేరేందుకు సిద్ధం!
Ryan ten Doeschate

ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. భారత పురుషుల క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న ర్యాన్ టెన్ డస్కటే తన పదవికి రాజీనామా చేశారు. జట్టులో తాను ఆశించిన స్థాయిలో బాధ్యతలు నిర్వహించే అవకాశం లభించకపోవడంతో తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన కొంతకాలంగా సంకేతాలు ఇస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే.


రెండేళ్ల కిందట భారత జట్టు అసిస్టెంట్ కోచ్‌గా ర్యాన్ టెన్ బాధ్యతలు చేపట్టారు. వాస్తవానికి ఫీల్డింగ్ కోచ్‌గా ఉండాలని భావించినా.. ఆ బాధ్యతలు టి.దిలీప్ కొనసాగిస్తున్నారు. దీంతో ర్యాన్ టెన్ సహాయ కోచ్‌గానే సేవలందించారు. భారత జట్టు ఫీల్డింగ్‌లోనూ దారుణ ప్రదర్శన కనబరుస్తుండటంతో దిలీప్ తన పదవిని వీడతాడని వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా ర్యాన్ టెన్ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చకు దారి తీసింది. 2024 టీ20 ప్రపంచ కప్ విజయం అనంతరం ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తప్పుకోవడంతో భారత జట్టు కోచింగ్ సిబ్బందిలో ర్యాన్ టెన్ చేరారు. బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సేవలందించినప్పటికీ, ఆయనకు శాశ్వత బాధ్యతలు కేటాయించలేదు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా టీ20, వన్డే సిరీస్‌ల్లో పరాజయం పాలైన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.


ఐపీఎల్‌లోకి ర్యాన్ టెన్!

జాతీయ జట్టుకు వీడ్కోలు పలికిన ర్యాన్ టెన్.. ఐపీఎల్ 2027లో కోల్‌కతా నైట్ రైడర్స్ కోచింగ్ బృందంలో చేరనున్నట్లు సమాచారం. కేకేఆర్‌లో ఆయనకు మరోసారి అభిషేక్ నాయర్‌తో కలిసి పనిచేసే అవకాశం లభించనుంది. వీరిద్దరూ గతంలో కేకేఆర్‌తో పాటు భారత జట్టు సహాయక సిబ్బందిలో కూడా కలిసి పనిచేశారు. ర్యాన్ టెన్ 2012, 2014లో కేకేఆర్ తరఫున ఆటగాడిగా ఐపీఎల్ టైటిళ్లు గెలవగా, 2022లో ఫీల్డింగ్ కోచ్‌గా తిరిగి జట్టులో చేరి 2024లో మరో టైటిల్ విజయానికి భాగస్వామిగా నిలిచారు.


భారత జట్టుతో ఆయన పనిచేసిన కాలంలో టీమిండియా 2025 ఆసియా కప్‌తో పాటు 2026 టీ20 ప్రపంచ కప్‌ను గెలిచింది. అయితే టెస్టు క్రికెట్‌లో మాత్రం ఆశించిన ఫలితాలు రాలేదు. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోల్పోవడంతో పాటు, స్వదేశంలో న్యూజిలాండ్ చేత 3-0, దక్షిణాఫ్రికా చేత 2-0 తేడాతో టెస్టు సిరీస్‌లు ఓడిపోయిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్: సబలెంకాతో జతకట్టనున్న జకోవిచ్

విదేశాల్లో భారత బ్యాటర్ల వైఫల్యానికి బౌండరీలే కారణం: సునీల్ గావస్కర్

Updated Date - Jul 28 , 2026 | 05:30 PM