భారత్, పాక్ మ్యాచ్‌లో టాస్ వివాదం.. ఏం జరిగిందంటే?
ABN , Publish Date - Nov 22 , 2026 | 05:38 PM
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత్-ఏ, పాకిస్థాన్-ఏ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆరంభంలో చిన్న గందరగోళం తలెత్తింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత్-ఏ, పాకిస్థాన్-ఏ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆరంభంలో చిన్న గందరగోళం తలెత్తింది. ఖతర్‌లోని దోహా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ టాస్ కోసం టీమిండియా-ఏ కెప్టెన్ తిలక్ వర్మ, పాకిస్థాన్-ఏ కెప్టెన్ అబ్దుల్ సమద్ గ్రౌండ్లోకి వచ్చారు. సమద్ హెడ్స్ కోరగా.. తిలక్ కాయిన్‌ను గాల్లోకి విసిరాడు. కాయిన్ నేలపై వాలగానే చూసిన రిఫరీ.. టెయిల్స్ పడిందని, భారత్ టాస్ నెగ్గిందని ప్రకటించాడు. అప్పుడే కెప్టెన్లు ఇద్దరూ కిందకు వంగి మరీ కాయిన్‌ను చూశారు. పడింది హెడ్స్ కాదని, టెయిల్స్ అని గుర్తించిన సమద్.. వెంటనే రిఫరీకి విషయం చెప్పాడు. రిఫరీ పరిశీలించి టాస్ తప్పుగా ప్రకటించానని అంగీకరించారు.
మళ్లీ నో షేక్ హ్యాండ్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్.. బ్యాటింగ్ ఎంచుకుంది. ‘మాకు మొదట బ్యాటింగ్ చేయాలని ఉంది. ఈరోజు మా జట్టులో గెలుస్తామన్న నమ్మకం బలంగా ఉంది. మరోవైపు పిచ్ డ్రైగా ఉంది. అందుకే బ్యాటింగ్ ఎంచుకున్నాం’ అని సమాద్ తెలిపాడు. అనంతరం తిలక్ మాట్లాడుతూ.. తామూ బ్యాటింగ్ ఎంచుకోవాలని అనుకున్నామని చెప్పాడు. పిచ్ చాలా డ్రైగా ఉందని, కాబట్టి బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని వివరించాడు. అయితే ఎప్పటిలాగే టాస్ తరువాత భారత్, పాక్ కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు.
తుది జట్లు ఇవే ..
భారత్-ఏ: తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్) రింకూ సింగ్, సూర్యాంశ్ షెడ్గే, షాబాజ్ అహ్మద్, విప్రజ్ నిగమ్, హర్షత్ రాణా, ప్రిన్స్ యాదవ్.
పాకిస్థాన్-ఏ: అబ్దుల్ సమద్ (కెప్టెన్), షమైల్ హుస్సేన్, మాజ్ సదాకత్, రోహైల్ నజీర్ (వికెట్ కీపర్), హసన్ నవాజ్, ఫర్హాన్ యూసఫ్, సాద్ మసూద్, ముహమ్మద్ ఇమ్రాన్ రంధవా, అహ్మద్ దానియల్, సుఫియాన్ ముకీమ్, అలీ రజా.
ఈ వార్తలూ చదవండి
పాక్ ప్లేయర్లే కాదు.. ఆ దేశ అంపైర్లు కూడా ఓవరాక్షనే.. ఈ వీడియోనే సాక్ష్యం!
పంత్ శతకంపై హర్షం వ్యక్తం చేసిన గావస్కర్.. వీడియో వైరల్!