రనౌట్ వివాదం: హెల్మెట్-గ్లౌవ్స్ విసిరికొట్టిన సల్మాన్ అఘాపై ఐసీసీ చర్యలు
ABN , Publish Date - Mar 14 , 2026 | 05:27 PM
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డేలో సల్మాన్ అఘా రనౌట్ వివాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో మైదానంలో అనుచితంగా ప్రవర్తించినందుకు పాక్ ప్లేయర్ సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ చర్యలు తీసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డేలో సల్మాన్ అఘా రనౌట్ వివాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్రీడాస్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని కొందరు అంటుండగా.. ఇది ఓ అంతర్జాతీయ మ్యాచ్, విజయం కోసం ఆడుతున్నప్పుడు ఇలాంటివి జరుగుతాయంటూ మరికొందరు అంటున్నారు. ఏదేమైనప్పటికీ మైదానంలో అనుచితంగా ప్రవర్తించినందుకు పాక్ ప్లేయర్ సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఔట్ నిర్ణయం రాగానే హెల్మెట్, బ్యాట్‌ను అఘా విసిరికొట్టాడు. మ్యాచ్ రిఫరీ నీయముర్ రషీద్ ఫిర్యాదు మేరకు లెవల్ 1 నేరానికి అఘా పాల్పడినట్లు ఐసీసీ తేల్చింది.
‘క్రికెట్ పరికరాలను అగౌరవపరిచినట్లు అఘాపై ఫిర్యాదు అందింది. మైదానంలోనే అతడు హెల్మెట్, గ్లౌవ్స్, బ్యాట్‌ను విసిరేసినట్లు తేలింది. గతంలో అతడి నుంచి ఇలాంటి ప్రవర్తన చూడలేదు. అయితే ఇప్పుడు మాత్రం అఘా చేసిన దానికి చర్యలు తీసుకుంటున్నాం. అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ జత చేశాం. బంగ్లాదేశ్ ప్లేయర్ లిటన్ దాస్‌తో వాగ్వాదంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అది కేవలం అపార్థంగా పరిగణించాం. మేం చట్టం ప్రకారమే నడుచుకున్నాం. నిష్పక్షపాతంగా వ్యవహరించి ఈ తీర్పు ఇచ్చాం’ అని ఐసీసీ స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి:
పాక్ ఆటగాళ్లకు రూ.50లక్షల జరిమానా.. ఆ వార్తలను ఖండించిన పీసీబీ
పాకిస్థాన్ ప్లేయర్ ప్రపంచ రికార్డ్..