స్పాట్ ఫిక్సింగ్.. వీడియో అనలిస్ట్‌పై జీవితకాల నిషేధం విధించిన బీసీసీఐ
ABN , Publish Date - Mar 14 , 2026 | 03:36 PM
స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఓ వీడియో అనలిస్ట్‌పై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో రాజా రెడ్డి అనే వ్యక్తి ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఫిర్యాదులు అందాయి. విచారణ చేపట్టిన బీసీసీఐ.. అతడిపై జీవితకాల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఓ వీడియో అనలిస్ట్‌పై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో రాజా రెడ్డి అనే వ్యక్తి ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఫిర్యాదులు అందాయి. విచారణ చేపట్టిన బీసీసీఐ.. నేరం రుజువు కావడంతో చర్యలకు ఉపక్రమించింది. అతడిపై జీవితకాల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
రెండేళ్ల క్రితం ఆంధ్ర-మధ్య ప్రదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో వీడియో అనలిస్ట్ రాజా రెడ్డి ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఫిర్యాదులు అందాయి. దీనిపై యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ విచారణ చేపట్టింది. కండక్టర్ కోడ్ ఆర్టికల్స్ 2.1.3, 2.1.14 కింద రాజా రెడ్డిపై నిషేధం విధించింది. బీసీసీఐ నియమించిన వీడియో అనలిస్ట్ కావడంతో అతడికి థర్డ్ అంపైర్, మ్యాచ్ రిఫరీ రూమ్‌లకు వెళ్లేందుకు అనుమతి ఉంది. ఆంధ్ర జట్టు మేనేజర్ చేసిన ఫిర్యాదు ప్రకారం.. జట్టు ‘ప్లేయింగ్ XI’కు సంబంధించిన సమాచారాన్ని అందించినందుకు ఆంధ్ర ఆటగాడు గిరినాథ్ రెడ్డికి రూ.5లక్షల మొత్తాన్ని రాజా రెడ్డి ఆఫర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాట్సప్ కాల్, చాట్ హిస్టరీని బీసీసీఐ కమిటీ పరిశీలించింది. గిరినాథ్ రెడ్డి ఈ విషయాన్ని టీమ్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లాడని.. తమకు వచ్చిన ఫిర్యాదుతో విచారించగా రాజా రెడ్డి నేరం చేసినట్టు తేలిందని బీసీసీఐ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
ఆ ముగ్గురు క్రికెట్ దిగ్గజాలకు ‘లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డ్’.. ప్రకటించిన బీసీసీఐ
రూల్స్ ప్రకారం అది రనౌటే.. కానీ న్యాయం కాదు: సల్మాన్ అఘా