నఖ్వీ ఓవరాక్షన్.. గట్టిగా షాకిచ్చేందుకు సిద్ధమైన ఐసీసీ!
ABN , Publish Date - Jan 25 , 2026 | 01:50 PM
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో బంగ్లాకు మద్దతుగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోసిన్ నఖ్వి పలు వ్యాఖ్యలు చేశాడు. దీంతో పాక్‌పై ఐసీసీ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. పాక్ క్రికెట్‌పై తీవ్ర ఆంక్షలు విధించేందుకు ఐసీసీ రంగం సిద్ధం చేసినట్లు ఓ అంతర్జాతీయ మీడియా కథనంలో పేర్కొంది
స్పోర్ట్స్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తొలగించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో బంగ్లాకు మద్దతుగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోసిన్ నఖ్వి పలు వ్యాఖ్యలు చేశాడు. దీంతో పాక్‌పై ఐసీసీ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఒక వేళ పాకిస్థాన్ (Pakistan) కూడా బంగ్లాదేశ్ బాటలోనే టీ20 ప్రపంచకప్( T20 World Cup) నుంచి వైదొలిగితే ఆ దేశ క్రికెట్‌పై తీవ్ర ఆంక్షలు విధించేందుకు ఐసీసీ రంగం సిద్ధం చేసినట్లు ఓ అంతర్జాతీయ మీడియా కథనంలో పేర్కొంది. ఈ చర్యల్లో భాగంగా అన్ని ద్వైపాక్షిక సిరీస్‌లను రద్దు చేయడం, పాకిస్థాన్ సూపర్ లీగ్(పీసీబీ)లో ఆడే విదేశీ ప్లేయర్లకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లను తిరస్కరించడం వంటి ఆంక్షలు విధించనుందని సమాచారం. అలానే ఆసియా కప్ నుంచి పాక్‌ను బయటకు పంపించేందుకు కూడా ఐసీసీ సిద్ధమైనట్లు కథనంలో వెల్లడైంది.
నఖ్వి ఏమన్నారంటే..
ఐసీసీ ఇచ్చిన గడువులో బంగ్లాదేశ్ తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. దీంతో టీ20 ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌కు చోటు కల్పించింది. ఇక ఈ మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్ ను తొలగించడంపై ఇటీవల నఖ్వి స్పందించాడు. బంగ్లాదేశ్‌కు ఐసీసీ అన్యాయం చేసిందని వ్యాఖ్యానించాడు. ఐసీసీలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(Bangladesh) కీలకమైందని, అలాంటి బోర్డుతో అన్యాయంగా వ్యవహరించారని నఖ్వి అన్నాడు. బుధవారం ఐసీసీ సమావేశంలో కూడా తాను ఇదే చెప్పానని వెల్లడించాడు. భారత్‌కు బంగ్లా జట్టును పంపకూడదన్న నిర్ణయం వెనుక చాలా కారణాలున్నాయని, ఇక్కడ ఒక దేశం అన్నింటినీ నిర్దేశిస్తోందని పరోక్షంగా భారత్ ను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశాడు.
ఇంతకుముందు భారత్, పాకిస్థాన్‌ల కోసం ఐసీసీ వేదికలను మార్చినపుడు, బంగ్లా విషయంలో అలా ఎందుకు చేయలేదని నఖ్వి ప్రశ్నించాడు. ఇదే సమయంలోటీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పాల్గొనే అంశంపై ప్రస్తావించాడు. ఐసీసీ టోర్నీలో పాల్గొనే విషయంపై ఓ నిర్ణయం తీసుకోవాలని తమ ప్రభుత్వాన్ని కోరనున్నట్లు చెప్పాడు. దీంతో పాక్ కూడా ఈ టోర్నీ నుంచి వైదలగనుందనే ప్రచారం మొదలైంది. మొత్తంగా నఖ్వి(Mohsin Naqvi ) ఓవరాక్షన్ ఆ దేశ క్రికెట్‌కే ఎసరు పెట్టేలా ఉన్నాయని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
క్రికెట్ అభిమానులకు క్రేజీ అప్‌డేట్.. నేడు టీ20 టికెట్ల విక్రయం