కోహ్లీని వైభవ్ అవమానించలేదు: హర్ష భోగ్లే
ABN , Publish Date - Jun 03 , 2026 | 11:34 AM
ఐపీఎల్ 2026లో సంచలన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వివాదానికి దారి తీసింది. ఈ వీడియోపై హర్ష భోగ్లే ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో సంచలన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వివాదానికి దారి తీసింది. ఆ వీడియోలో వైభవ్.. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని అవమానించేలా మాట్లాడినట్లు ఉంది. విరాట్ గురించి ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే ఒక ప్రశ్న అడిగితే.. కోహ్లీ చాలా నెమ్మదిగా ఆడతాడంటూ వైభవ్ దానికి సమాధానం ఇచ్చినట్లుగా చూపించారు. ఈ వీడియోపై హర్ష భోగ్లే ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు. ఆ వీడియోలో వాస్తవం లేదని.. అది ఫేక్ వీడియో అని స్పష్టం చేశాడు.
‘నాకు, వైభవ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో క్లియర్‌గా ఫేక్. అందులో వైభవ్‌ను మర్యాద తెలియనివాడిగా, అహంకారిగా, అసభ్యంగా చూపించే ప్రయత్నం చేశారు. నేను అతడిని ఆ ప్రశ్న అడగలేదు. అతడు కూడా అలాంటి సమాధానమేదీ ఇవ్వలేదు. ఉద్దేశపూర్వకంగానే ఆ వీడియోను క్రియేట్ చేశారు. ఎంతో వినయంగా ఉండే ఓ యువ క్రికెటర్‌పై ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం దారుణం’ అని హర్ష భోగ్లే పేర్కొన్నాడు.
ఆ వీడియోలో ఏముందంటే..
‘మీరు కూడా విరాట్ కోహ్లీలా క్రికెట్ ప్రపంచాన్ని ఓ రాజులా ఏలాలి అనుకుంటున్నారా?’ అని హర్ష భోగ్లే వైభవ్‌ను అడిగాడు. ‘నాకు విరాట్ భయ్యా అంటే చాలా ఇష్టం. కానీ నాకు అతడి రికార్డ్స్ అంటే ఇష్టం లేదు. అతడు చాలా నెమ్మదిగా ఆడతాడు. హాఫ్ సెంచరీలు, సెంచరీలు చేయడానికి చాలా టైం తీసుకుంటాడు..’ అని వైభవ్ సమాధానం ఇచ్చినట్లుగా ఆ వీడియోలో ఉంది. కాగా ఇదంతా ఫేక్ అని హర్ష భోగ్లే క్లారిటీ ఇచ్చాడు.
ఇవి కూడా చదవండి:
ప్రపంచ నం.1 కార్ల్‌సన్‌కు మరో షాక్.. చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద
అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్.. రోహిత్ శర్మ దూరం కానున్నాడా?