Share News

ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ ప్లేయర్

ABN , Publish Date - May 22 , 2026 | 08:57 PM

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు పలుకుతున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించాడు. ఇన్నాళ్లు తనకు మద్దతుగా నిలిచిన బీసీసీఐ, ఫ్యాన్స్, భారత క్రికెట్ జట్టుకు ధన్యవాదాలు తెలిపాడు.

ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ ప్లేయర్
Vijay Shankar

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు పలుకుతున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించాడు. ఇన్నాళ్లు తనకు మద్దతుగా నిలిచిన బీసీసీఐ, ఫ్యాన్స్, భారత క్రికెట్ జట్టుకు ధన్యవాదాలు తెలిపాడు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.


‘క్రికెటే నా జీవితం. పదేళ్ల వయసులో మొదలైన క్రికెట్ ప్రయాణం 25 ఏళ్ల తర్వాత ఈ స్థాయికి చేరింది. టీమిండియాలో ఆడే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలోనే అత్యంత గర్వకారణమైన క్షణం’ అని పేర్కొన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో తమిళనాడు తరఫున విజయ్ శంకర్ అద్భుత ప్రదర్శన చేశాడు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌తో పాటు, మీడియం పేస్ బౌలింగ్‌తో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఈ నిలకడైన ఆటతీరే అతడికి జాతీయ జట్టులో చోటు సంపాందించి పెట్టింది. 2018లో శ్రీలంకలో జరిగిన నిదహాస్ ట్రోఫీ ద్వారా అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన శంకర్.. ఆ తర్వాత వన్డేల్లోనూ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. విజయ్ శంకర్ తన క్రికెట్ కెరీర్‌లో 12 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు.


‘త్రీ డీ’ ట్యాగ్ వచ్చిందలా..

విజయ్ శంకర్ కెరీర్‌లో అత్యంత కీలకమైన ఘట్టం 2019 వన్డే ప్రపంచ కప్. అప్పట్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అంబటి రాయుడును పక్కన పెట్టి మరీ సెలక్టర్లు విజయ్ శంకర్‌ను ప్రపంచ కప్ జట్టులోకి ఎంపిక చేశారు. ఆ సమయంలో చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్.. అతడిని ‘త్రీ డైమెన్షనల్’ ప్లేయర్‌గా అభివర్ణించాడు. అప్పట్లో ఆ మాట క్రీడా వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. ఆ టోర్నీలో విజయ్ పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వేసిన తొలి బంతికే వికెట్ తీసి రికార్డు సృష్టించాడు. అయితే ఆ తర్వాత కాలి వేలి గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే నిష్క్రమించాల్సి వచ్చింది. ఆ తర్వాత జాతీయ జట్టులోనూ చోటు కోల్పోయాడు.


ఐపీఎల్ కెరీర్..

ఐపీఎల్‌లో విజయ్ శంకర్ చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్ జట్టు టైటిల్ గెలవడంలో, తర్వాతి సీజన్‌లో రన్నరప్‌గా నిలవడంలో విజయ్ శంకర్ కీలక పాత్ర పోషించాడు. ఆఖరిగా సీఎస్కే తరఫున ప్రాతినిధ్యం వహించాడు. కాగా ఈ సీజన్‌లో అతడిని ఎవరూ కొనుగోలు చేయలేదు. దేశీయ క్రికెట్‌లో కూడా విజయ్ శంకర్ ప్రదర్శన ఆకట్టుకునేలా సాగింది. 77 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 4,253 పరుగులు, 13 సెంచరీలు నమోదు చేయడంతో పాటు 43 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్-ఏ, టీ20 ఫార్మాట్లలోనూ బ్యాట్, బంతితో తన ముద్ర వేశాడు. ఇప్పుడు అతని కొత్త ప్రయాణం ఎలా ఉండబోతోందో చూడాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

బిహార్‌కీ ఓ ఐపీఎల్ టీమ్ ఉండాలి: బిలియనీర్ అనిల్ అగర్వాల్

సీఎస్కే వైఫల్యానికి అసలు కారణం ఇదే: సెహ్వాగ్

Updated Date - May 22 , 2026 | 08:57 PM