ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సి జెర్సీ ధర రూ.56 లక్షలు!
ABN , Publish Date - Aug 21 , 2026 | 12:20 PM
మాంచెస్టర్ యునైటెడ్ జట్టు మాజీ థెరపిస్ట్ రాడ్ థార్న్‌లే వద్ద భద్రపరిచిన ఫుట్‌బాల్ వస్తువులకు వేలంలో అద్భుతమైన స్పందన లభించింది. బార్సిలోనా తరఫున ఆడిన కాలంలో లియోనెల్ మెస్సి ధరించిన ఒక జెర్సీ వేలంలో ఏకంగా రూ. 56.4 లక్షల ధర పలికింది.
స్పోర్ట్స్ డెస్క్: ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సి క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ స్టార్ ఫుట్‌బాలర్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. మెస్సి ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్ ఆడినా ఇసకేస్తే రాలనంత మంది జనాలు స్టేడియాలకు తరలి వస్తారు. అతను ధరించే బ్రాండ్‌లు, అతనికి సంబంధించిన వస్తువుల రేంజ్ వేరే లెవెల్లో ఉంటుంది. తాజాగా మెస్సి ధరించిన జెర్సీని వేలానికి పెట్టగా భారీ ధరకు అది అమ్ముడైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మాంచెస్టర్ యునైటెడ్ జట్టు మాజీ థెరపిస్ట్ రాడ్ థార్న్‌లే (Rod Thornley) వద్ద భద్రపరిచిన ఫుట్‌బాల్ వస్తువులకు వేలంలో అద్భుతమైన స్పందన లభించింది. బార్సిలోనా తరఫున ఆడిన కాలంలో లియోనెల్ మెస్సీ ధరించిన ఒక జెర్సీ వేలంలో ఏకంగా 66,107 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 56.4 లక్షలు) ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో క్రిస్టియానో రొనాల్డో ధరించిన రియల్ మాడ్రిడ్ జెర్సీ కేవలం 10,601 డాలర్లు (సుమారు రూ. 9.05 లక్షలు) మాత్రమే పలికింది. ఈ వేలంతో ఫుట్‌బాల్ ప్రపంచంలో మెస్సి క్రేజ్ మరోసారి స్పష్టమైందని అతడి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మెస్సి ధరించిన ఈ జెర్సీ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 2012లో బార్సిలోనా, మాంచెస్టర్ మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. అయితే బార్సిలోనా జట్టు ఇంగ్లండ్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానానికి రాకముందు రాడ్ థార్న్‌లే బార్సిలోనా డిఫెండర్ గెరార్డ్ పిక్వెను వ్యక్తిగతంగా కలిసి మెస్సి జెర్సీని ఇవ్వమని కోరాడు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత పిక్వె నేరుగా థార్న్‌లేను బార్సిలోనా జట్టు డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లాడు. ఆ సమయంలో మెస్సి అదే జెర్సీ మీద ఉన్నాడు. కాసేపటి తర్వాత మెస్సి స్వయంగా ఆ జెర్సీని తీసి, సంతకం చేసి థార్న్‌లే బహుమతిగా ఇవ్వడంతో పాటు అతడితో కరచాలనం చేశాడు. ఈ అరుదైన జ్ఞాపకం తన జీవితంలో ఎప్పటికీ మరువలేనిదని థార్న్‌లే గుర్తుచేసుకున్నాడు. ఈ జెర్సీ కేవలం మెస్సీ ధరించిందనే కాకుండా, ఇద్దరు దిగ్గజ క్లబ్‌ల మధ్య మైత్రికి, ప్రపంచ స్థాయి ఆటగాడి జ్ఞాపకానికి ప్రతీకగా నిలవడం వలనే వేలంలో భారీ ధరకు అమ్ముడైందని థార్న్ లే తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
22 ఏళ్ల నాటి కేసు.. నిర్దోషిగా టీమిండియా మాజీ క్రికెటర్
ఫిఫా మహిళల ప్రపంచ కప్ 2027 షెడ్యూల్ విడుదల..