ఫిఫా ప్రపంచకప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రియాద్ మహ్రెజ్ వ్యాఖ్యలతో వివాదం!
ABN , Publish Date - Jun 29 , 2026 | 07:30 PM
ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ దశ ఆఖరి మ్యాచ్‌లో తీవ్ర ఉత్కంఠ రేపిన అల్జీరియా, ఆస్ట్రియా సమరం ఇప్పుడు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో పెద్ద వివాదానికి తెరలేపింది. కాన్సాస్ సిటీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ 3-3తో డ్రాగా ముగియడంతో అల్జీరియా, ఆస్ట్రియా రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించాయి.
స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ దశ ఆఖరి మ్యాచ్‌లో తీవ్ర ఉత్కంఠ రేపిన అల్జీరియా, ఆస్ట్రియా సమరం ఇప్పుడు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో పెద్ద వివాదానికి తెరలేపింది. కాన్సాస్ సిటీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ 3-3తో డ్రాగా ముగిసింది. అల్జీరియా, ఆస్ట్రియా జట్లు చెరో పాయింట్ సాధించి రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించాయి. అయితే, ఈ ఫలితంతో ఆసియా అగ్రశ్రేణి జట్టు ఇరాన్ టోర్నీ నుంచి దురదృష్టవశాత్తూ నిష్క్రమించింది.
ఇరాన్ నాకౌట్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రియా తప్పక గెలవాల్సి ఉండేది. కానీ, మ్యాచ్ ముగిసిన తీరు చూస్తే ఇరు జట్లు కుమ్మక్కయ్యాయనే ఆరోపణలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. మ్యాచ్ అనంతరం అల్జీరియా కెప్టెన్ రియాద్ మహ్రెజ్ చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. మ్యాచ్ ముగింపు దశలో ఆస్ట్రియా డిఫెండర్లు పెద్దగా శ్రమించలేదని, అది తనకు 'ఇబ్బందికరంగా' (Awkward) అనిపించిందని మహ్రెజ్ స్వయంగా అంగీకరించాడు.
'నిజం చెప్పాలంటే ఆ సమయంలో పరిస్థితి కాస్త విచిత్రంగా అనిపించింది. మేము బంతిని వైడ్‌గా ఆడుతుంటే, వారు డిఫెన్స్‌కే పరిమితమయ్యారు. ఆఖరి నిమిషంలో నా సహచరుడు బంతిని పాస్ చేయగా, నేను గోల్ చేయాల్సి వచ్చింది. ఫుట్‌బాల్ క్రీడను గౌరవించి నేను ఆ గోల్ చేశాను. అయితే వారు కూడా వెనువెంటనే గోల్ చేసి నాకౌట్‌కు అర్హత సాధించడం వారికి మంచిదైంది. ఇద్దరం అర్హత సాధించడమే ఇక్కడ ముఖ్యం' అని మహ్రెజ్ వ్యాఖ్యానించాడు. కాగా, స్టాపేజ్ టైమ్ (90+3వ నిమిషం)లో మహ్రెజ్ గోల్ చేసి అల్జీరియాను 3-2తో ముందంజలో నిలిపాడు.
ఆ సమయంలో ఆస్ట్రియా టోర్నీ నుంచి ఔట్ అయినట్లే అనిపించినా, కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే (90+5వ నిమిషం) ఆస్ట్రియా ఆటగాడు సాసా కాలాజ్డిక్ హెడర్ ద్వారా గోల్ చేసి మ్యాచ్‌ను 3-3తో సమం చేయడం గమనార్హం. మరోవైపు, ఆస్ట్రియా ప్రధాన కోచ్ రాల్ఫ్ రంగ్‌నిక్ ఈ ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేశారు. స్టాపేజ్ టైమ్‌లో ఇరు జట్లు చేసిన గోల్స్.. మ్యాచ్‌ను గెలవడానికి ఎంతగా ప్రయత్నించామో చెప్పడానికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ, 1982 ప్రపంచకప్‌లో అల్జీరియాను టోర్నీ నుంచి తప్పించడానికి ఆస్ట్రియా, పశ్చిమ జర్మనీలు ఆడిన 'డిస్‌గ్రేస్ ఆఫ్ గిజోన్' మ్యాచ్‌ను ఈ తాజా వివాదం అభిమానులకు గుర్తు చేస్తోంది.
ఇవి కూడా చదవండి:
ఒలింపిక్స్2028... టీమిండియా అభిమానులకు శుభవార్త!
భారత్‌పై చరిత్రాత్మక విజయం.. ఐర్లాండ్ కోచ్ సంచలన నిర్ణయం