ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు షాక్.. వచ్చే ఏడాదిలో ఏకంగా రూ.627 కోట్ల నష్టం!
ABN , Publish Date - Nov 08 , 2026 | 08:07 PM
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు వచ్చే ఏడాది ఆర్థికంగా పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. 2027లో ఈసీబీ ఏకంగా 50 మిలియన్ పౌండ్లు (సుమారు రూ.627 కోట్లు) నష్టపోయే ప్రమాదం ఉందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కు వచ్చే ఏడాది ఆర్థికంగా పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. 2027లో ఈసీబీ ఏకంగా 50 మిలియన్ పౌండ్లు (సుమారు రూ.627 కోట్లు) నష్టపోయే ప్రమాదం ఉందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. సొంతగడ్డపై భారత్‌తో ఎలాంటి సిరీస్‌లు లేకపోవడం, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి రావాల్సిన ప్రసార ఆదాయంలో కోత పడనుండటమే ఇందుకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. 2027లో ఆస్ట్రేలియాతో ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నప్పటికీ ఈసీబీకి భారీ నష్టాలు తప్పేలా లేవు. భారత్‌తో జరిగే మ్యాచ్‌ల ద్వారా ఇంగ్లండ్ బోర్డుకు భారీ మొత్తంలో ఆదాయం వస్తుంది. అలాంటి పర్యటన లేకపోవడం ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది.
ఈ నష్టాల ప్రభావాన్ని తగ్గించేందుకు ఐసీసీతో కలిసి పనిచేయాలని ఈసీబీ భావిస్తోంది. కాగా 2027లో సభ్య దేశాలకు ఇవ్వాల్సిన ప్రసార ఆదాయంలో కొంత మొత్తాన్ని నిలిపివేయాలని ఐసీసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ అది మొత్తం ఎంతన్నది ఇంకా స్పష్టంగా తెలియకపోవడంతో.. నష్టాలను 35 మిలియన్ పౌండ్లకు (సుమారు రూ.439 కోట్లు) పరిమితం చేయగలమని బోర్డు ఆశాభావంతో ఉంది. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కల కాలం 2028 జనవరి 31 వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో అదనపు వాణిజ్య ఒప్పందాలు, ఇతర ఈవెంట్ల ద్వారా మరింత ఆదాయం సంపాదించేందుకు ఈసీబీకి ఇంకా అవకాశాలు ఉన్నాయి.
భారత్‌పైనే ఇంగ్లండ్ బోర్డు ఆశలు!
ప్రపంచ క్రికెట్ ఆర్థిక వ్యవస్థలో భారత టెలివిజన్ మార్కెట్, ప్రేక్షకుల ఆదరణ అత్యంత కీలకంగా మారాయి. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ప్రస్తుతం సోనీ పిక్చర్స్‌తో ఈసీబీకి ఆరేళ్ల ప్రసార ఒప్పందం ఉంది. దీని విలువ 185 మిలియన్ పౌండ్లు (సుమారు రూ.2,323 కోట్లు). అయితే ఈ ఒప్పందం 2028లో ముగియనుంది. తదుపరి ఒప్పందం ద్వారా వచ్చే ఆదాయం ప్రస్తుత ఒప్పందం కంటే తక్కువగా ఉండవచ్చని అంచనా. ఈసీబీకి వచ్చే భారీ నష్టాలు ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్‌పై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
ఇవి కూడా చదవండి:
అండర్ 19 ఆసియా కప్: భారత్‌పై పాక్ విజయం
హార్దిక్ పాండ్య లేకపోయినా ముంబైకి పెద్దగా నష్టం లేదు: ఆకాశ్ చోప్రా