Share News

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలో డారిల్ మిచెల్

ABN , Publish Date - Jan 21 , 2026 | 02:52 PM

న్యూజిలాండ్‌ స్టార్ బ్యాటర్‌ డారిల్‌ మిచెల్‌ వన్డే క్రికెట్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్‌ కోహ్లిని వెనక్కి నెట్టి నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా నిలిచాడు.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్..  అగ్రస్థానంలో డారిల్ మిచెల్
Daryl Mitchell

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌ స్టార్ బ్యాటర్‌ డారిల్‌ మిచెల్‌ వన్డే క్రికెట్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్‌ కోహ్లిని వెనక్కి నెట్టి నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా నిలిచాడు. భారత్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో మిచెల్ చివరి రెండు మ్యాచ్‌ల్లో వరుస సెంచరీలు బాదిన విషయం తెలిసిందే. దీంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకాడు.


భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో మిచెల్ మొత్తం 352 పరుగులు సాధించాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 845 ఐసీసీ రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ 795 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. చివరి వన్డేలో కోహ్లీ అద్భుతమైన శతకం (124) చేసినప్పటికీ, సిరీస్‌ మొత్తంలో మిచెల్‌ ప్రదర్శన అతడిని మించి ఉండటంతో అగ్రస్థానం దక్కింది.


ఇదిలా ఉండగా, సిరీస్‌ ప్రారంభంలో నంబర్‌ వన్‌గా ఉన్న టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్‌ శర్మ వరుసగా మూడు మ్యాచుల్లో విఫలమవడంతో నాలుగో స్థానానికి పడిపోయాడు. అతడి ఖాతాలో ప్రస్తుతం 757 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. ఆఫ్గానిస్తాన్‌ బ్యాటర్‌ ఇబ్రహీం జద్రాన్‌ ఇటీవల వన్డేలు ఆడకపోయినా ఒక స్థానం ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు.


టాప్‌ 10లో కేఎల్‌ రాహుల్‌..

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో శతకం సాధించిన కేఎల్‌ రాహుల్‌.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌ 10లోకి దూసుకొచ్చాడు. ప్రస్తుతం అతడికి 670 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. భారత కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ రెండో వన్డేలో అర్ధశతకం చేయడంతో తన ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ జాబితాలో టాప్ 10లో టీమిండియా ప్లేయర్లే నలుగురు ఉండటం విశేషం.


ఇవి కూడా చదవండి:

నేను సెల్ఫీల కోసం రాలేదు.. సాయం కోసం వచ్చా: రోహిత్ శర్మ వద్దకు దూసుకొచ్చిన మహిళ

లిజెలీ లీకి షాక్.. కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనపై చర్యలు

Updated Date - Jan 21 , 2026 | 02:55 PM