రొనాల్డో షాకింగ్ నిర్ణయం: పోర్చుగల్ క్యాంప్ నుంచి వాకౌట్!
ABN , Publish Date - Oct 01 , 2026 | 09:15 PM
ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (41) పోర్చుగల్ జాతీయ జట్టుకు హఠాత్తుగా దూరమవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. హెడ్ కోచ్ జార్జ్ జీసస్‌తో వచ్చిన తీవ్ర విభేదాల కారణంగా రొనాల్డో జట్టు శిక్షణ శిబిరాన్ని వీడాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (41) పోర్చుగల్ జాతీయ జట్టుకు హఠాత్తుగా దూరమవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. హెడ్ కోచ్ జార్జ్ జీసస్‌తో వచ్చిన తీవ్ర విభేదాల కారణంగా రొనాల్డో జట్టు శిక్షణ శిబిరాన్ని (ట్రైనింగ్ క్యాంప్) వదిలి వెళ్లాడు. రోనాల్డ్ తీసుకున్న ఈ నిర్ణయం ఫుట్‌బాల్ వర్గాల్లో సంచలనం రేపుతోంది.
స్టార్టింగ్ ఎలెవన్‌లో చోటు లేకపోవడమే కారణమా?
యుఈఎఫ్‌ఏ నేషన్స్ లీగ్‌లో భాగంగా డెన్మార్క్‌తో జరిగే కీలక మ్యాచ్‌లో రొనాల్డోను తుది జట్టులో (స్టార్టింగ్ ఎలెవన్) కాకుండా బెంచ్‌కే పరిమితం చేస్తున్నట్లు కోచ్ జార్జ్ జీసస్ ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చిన కొద్ది గంటల్లోనే రొనాల్డో క్యాంప్ నుంచి నిష్క్రమించడం గమనార్హం. కాగా, తాను జట్టును వీడటానికి గల అసలు కారణాలను త్వరలోనే పోర్చుగల్ ప్రజలకు, తన అభిమానులకు ప్రత్యక్షంగా వివరిస్తానని రొనాల్డో పేర్కొన్నాడు.
రొనాల్డో జట్టును వీడిన మరుసటి రోజే అతడికి ఎంతో ప్రత్యేకమైన 'నంబర్ 7' జెర్సీని యంగ్ స్టార్ రఫెల్ లీయోకు కేటాయించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో రొనాల్డో అంతర్జాతీయ కెరీర్‌కు దాదాపు తెరపడినట్లేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామంపై పోర్చుగల్ పత్రికలు 'రొనాల్డో విషాద వీడ్కోలు', 'జాతీయ జట్టుకు గుడ్ బై చెప్పిన సీఆర్-7' అంటూ కథనాలను ప్రచురించాయి.
మరోవైపు జట్టు నిబంధనలను ఉల్లంఘించి శిక్షణ శిబిరం నుండి నిష్క్రమించినందుకు రొనాల్డోపై పోర్చుగల్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఇది తన ఆఖరి సీజన్ అని సంకేతాలిచ్చిన రొనాల్డో, ఇలాంటి చేదు అనుభవంతో కెరీర్ ముగించడం అతడి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
ఇవి కూడా చదవండి:
విండీస్‌పై విజయం తర్వాత టీమిండియాకు భారీ షాక్..
ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. 8 ఏళ్ల తర్వాత ఆ ప్లేయర్‌కి పిలుపు