Share News

మరో 99 పరుగులు.. కొత్త చరిత్ర సృష్టించనున్న వైభవ్

ABN , Publish Date - Apr 17 , 2026 | 05:29 PM

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ డేంజరస్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ సంచలన ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. అసాధారణ ప్రతిభను కనబరుస్తున్న ఈ యువ కిశోరం, ఏప్రిల్ 19న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు రెడీ అయ్యాడు.

 మరో 99  పరుగులు.. కొత్త చరిత్ర సృష్టించనున్న వైభవ్
Vaibhav Surya Vanshi

స్పోర్ట్స్ డెస్క్: రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన ఆటతీరుతో క్రికెట్ ప్రియులను మంత్రముగ్దులను చేస్తున్నాడు. జాతీయ జట్టు తరఫున అదరగొట్టిన వైభవ్.. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026లో కూడా చెలరేగి ఆడుతున్నాడు. 15 ఏళ్ల వయసులోనే దిగ్గజ బౌలర్లకు చెమటలు పట్టిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఇప్పటికే పలు రికార్డులను బద్దలుకొట్టాడు. ఏప్రిల్ 19న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఓ డేజరస్ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది. మరి.. ఆ రికార్డు ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...


భారత క్రికెట్ చరిత్రలో టీ20 ఫార్మాట్‌లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన రికార్డు దేవదత్ పడిక్కల్ పేరిట ఉంది. అతడు 25 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించాడు. అయితే చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం కేవలం 23 ఇన్నింగ్స్‌లలోనే 901 పరుగులు పూర్తి చేశాడు. ఏప్రిల్ 19న ఈడెన్ గార్డెన్స్‌లో జరగబోయే తన 24వ ఇన్నింగ్స్‌లో వైభవ్ మరో 99 పరుగులు సాధిస్తే, పడిక్కల్ రికార్డును అధిగమించి టాప్‌లోకి చేరుకుంటాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో డౌకౌట్ కావడంతో ప్రపంచ రికార్డు మిస్సైంది. అయినప్పటికీ భారత రికార్డును సొంతం చేసుకునే అవకాశం మాత్రం ఇంకా సజీవంగానే ఉంది.


వైభవ్ తన 24వ ఇన్నింగ్స్‌లో 1000 చేస్తే, ఓవరాల్ గా మూడవ స్థానంలో నిలుస్తాడు. ప్రస్తుతం టీ20ల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన రికార్డు ఆస్ట్రేలియా ఆటగాళ్లు షాన్ మార్ష్, బ్రాడ్ హాడ్జ్ (23 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉంది. వారి తర్వాత మాథ్యూ హేడెన్ (24 ఇన్నింగ్స్‌లు) ఉన్నాడు. అలానే జాతీయ స్థాయిలో వైభవ్ తొలి స్థానంలో నిలుస్తాడు. దీంతో ఏప్రిల్ 19న జరిగే పోరు వైభవ్ కెరీర్‌లోనే ఒక కీలక మలుపుగా మారనుంది.


ఇవి కూడా చదవండి:

డగౌట్‌లో ఫోన్ వాడకం.. ఆర్ఆర్ టీమ్ మేనేజర్‌కు జరిమానా విధించిన బీసీసీఐ

గుజరాత్‌పై వరుణ్ చక్రవర్తి విజృంభణ చూస్తాం: కార్తిక్ త్యాగి

Updated Date - Apr 17 , 2026 | 06:07 PM