0, 0, 0.. టీ20 చరిత్రలో అద్భుతం.. ఐదు గోల్డెన్ డక్‌లు!
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:42 PM
భారత టీ20 చరిత్రలోనే గుర్తుండిపోయే రెండు అరుదైన రికార్డులు తమిళనాడు ప్రిమియర్ లీగ్‌లో చోటుచేసుకున్నాయి. టీఎన్‌పీఎల్2026లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్ లో తొలి ఓవర్ మొదటి మూడు బంతులకే వికెట్లు పడటమే కాకుండా.. ఐదుగురు బ్యాటర్లు గోల్డెన్ డకౌట్ అయ్యారు.
స్పోర్ట్స్ డెస్క్: టీ20లో తరచూ అనేక రికార్డులు నమోదు అవుతుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే అరుదైన రికార్డులు నమోదవుతుంటాయి. తాజాగా అలాంటి రెండు రికార్డులకు తమిళనాడు ప్రీమియర్ లీగ్(TNPL) వేదికైంది. తొలి ఓవర్‌లో మొదటి మూడు బంతులకే హ్యాట్రిక్ వికెట్లు పడటమే కాకుండా.. ఏకంగా ఐదుగురు బ్యాటర్లు గోల్డెన్ డకౌట్ అయ్యారు. ఈ రెండు అద్భుతాలు టీఎన్‌పీఎల్2026లో భాగంగా తిరుచ్చి గ్రాండ్ చోళాస్ - విదా కోవై కింగ్స్ జట్ల మధ్య జరిగిన క్వాలిఫయర్ -2 మ్యాచ్‌లో చోటుచేసుకున్నాయి.
టాస్ గెలిచిన విదా జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. అనంతరం 184 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ దిగిన తిరుచ్చి జట్టు.. విదాపేసర్ దీబన్ లింగేశ్ ధాటికి 99 పరుగులకే ఆలౌటైంది. తొలి ఓవర్ వేసిన లింగేశ్.. మొదటి మూడు బంతులకే మూడు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ సాధించాడు. భారత టీ20 చరిత్రలో తొలి మూడు బంతులకే హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా లింగేశ్ నిలిచాడు. ఆ తర్వాత మూడు బంతులకు పరుగులు ఇవ్వకుండా బ్యాటర్లను కట్టడి చేశాడు. తిరుచ్చి ఓపెనర్ రాజ్‌కుమార్‌ను ఇన్నింగ్స్ తొలి బంతికే పెవిలియన్‌కు చేర్చిన లింగేశ్.. రెండో బంతికి శ్యామ్ సుందర్, మూడో బంతికి జగదీశన్‌ను ఔట్ చేశాడు.
ఇదే మ్యాచ్‌లో మరో సంచలనం కూడ నమోదైంది. తిరుచ్చి జట్టులో ఐదుగురు బ్యాటర్లు.. తాము ఆడిన తొలి బంతికే(గోల్డెన్ డక్) ఔటయ్యారు. ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మరో ఐదుగురు పరుగుల ఖాతా కూడా తెరవలేదు. అందరూ గోల్డెన్ డక్‌లే కావడం గమనార్హం. ఓపెనర్ రాజ్‌కుమార్, శ్యామ్ సుందర్, జగదీశన్, జాఫర్ జమాల్, అతిసాయరాజ్ డేవిడ్సన్ తొలి బంతికే ఔటయ్యారు. ఇలా భారత టీ20 మ్యాచ్‌లో ఐదుగురు బ్యాటర్లు గోల్డెన్ డక్ కావడం ఇదే తొలిసారి. గోల్డెన్ డక్ అయిన ఐదుగురు బ్యాటర్లలో ముగ్గురిని విదా బౌలర్ దీబన్ లింగేశ్ పెవిలియన్‌కు పంపించాడు. తన పదునైన బౌలింగ్‌లో తిరుచ్చి ఓటమిని శాసించిన లింగేశ్.. ప్లేయర్ ఆఫ్ ది అవార్డు అందుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
న్యూజిలాండ్‌లో భారత్ టూర్‌కు భారీ క్రేజ్..రికార్డు స్థాయిలో టికెట్ల విక్రయం!
క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయంపై మౌనం వీడిన అనయ బంగర్