Share News

విధ్వంసం.. ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లు.. వీడియో వైరల్!

ABN , Publish Date - Jun 22 , 2026 | 03:24 PM

క్రికెట్ ప్రపంచం‌లో మరో సిక్సర్ల విధ్వంసం చోటుచేసుకుంది. మేజర్ లీగ్ క్రికెట్ 2026లో భాగంగా లాస్ ఏంజెలెస్‌ నైట్ రైడర్స్‌ బ్యాటర్ రోవ్‌మన్ పావెల్ ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. సియాటెల్ ఓర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

విధ్వంసం.. ఒకే ఓవర్లో  ఐదు  సిక్స్‌లు.. వీడియో వైరల్!
MLC 2026

స్పోర్ట్స్ డెస్క్: మేజర్ లీగ్ క్రికెట్ (MLC 2026) ఆరో మ్యాచ్‌లో లాస్ ఏంజెలెస్‌ నైట్ రైడర్స్ విధ్వంసకర బ్యాటర్ రోవ్‌మన్ పావెల్ సిక్సర్ల తుఫాన్ సృష్టించాడు. సియాటెల్ ఓర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక ఆల్‌రౌండర్ డాసున్ శనక వేసిన ఒకే ఓవర్లో వరుసగా 5 సిక్సర్లు బాది స్టేడియాన్ని హోరెత్తించాడు. 15వ ఓవర్లో నైట్ రైడర్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 136 పరుగులతో ఒత్తిడిలో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన పావెల్ కేవలం 11 బంతుల్లోనే 37 పరుగులు (5 సిక్సర్లు, 1 ఫోర్) చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.


ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఈ హై వోల్టేజ్ డ్రామా చోటుచేసుకుంది. శానక వేసిన మొదటి ఐదు బంతులను మైదానం నలుమూలలా స్టాండ్స్‌లోకి పంపిన పావెల్.. గతంలో యువరాజ్ సింగ్ పేరిట ఉన్న ఆరు బంతులకు ఆరు సిక్సర్ల ప్రపంచ రికార్డును సమం చేసేలా కనిపించాడు. అయితే, ఆఖరి బంతికిని శానక తెలివిగా వేయడంతో మరో సిక్సర్ కొట్టే ప్రయత్నంలో టైమింగ్ మిస్సై థర్డ్ మ్యాన్ వద్ద క్యాచ్ ఔటయ్యాడు. దీంతో యువరాజ్ రికార్డు త్రుటిలో చేజారింది. అయినప్పటికీ ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగుల భారీ స్కోరు సాధించింది.


అనంతరం 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సియాటెల్ ఓర్కాస్ జట్టు నైట్ రైడర్స్ బౌలర్ల ధాటికి విలవిల్లాడింది. ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ (5) తక్కువ పరుగులకే అవుట్ కాగా, ఏ ఒక్క బ్యాటర్ క్రీజులో కాసేపు కూడా ఉండలేకపోయారు. ఆండ్రీ రస్సెల్, వాన్ షాల్క్‌విక్ చెరో 3 వికెట్లతో విరుచుకుపడటంతో సియాటెల్ జట్టు 115 పరుగులకే కుప్పకూలింది. దీంతో లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ 81 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి టోర్నీలో తమ విజయ పరంపరను కొనసాగించింది. మొత్తంగా పావెల్ కొట్టిన వరుస ఐదు సిక్సర్ల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

పాకిస్థాన్, ఇంగ్లండ్ ఏకైక టెస్టు మ్యాచ్ రద్దు..!

ఫిఫా ప్రపంచ కప్: లాకర్ రూమ్‌లో ఇరాన్ జట్టు నోట్!

Updated Date - Jun 22 , 2026 | 03:46 PM