Share News

అరుదైన రికార్డు సాధించిన న్యూజిలాండ్ ఓపెనర్లు

ABN , Publish Date - Jun 26 , 2026 | 10:44 AM

ట్రెంట్‌ బ్రిడ్జ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో న్యూజిలాండ్‌ ఓపెనర్లు టామ్‌ లాథమ్‌, డెవాన్‌ కాన్వే చరిత్ర సృష్టించారు. ఈ మ్యాచ్‌లో ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 317 పరుగులు జోడించారు.

అరుదైన రికార్డు సాధించిన న్యూజిలాండ్ ఓపెనర్లు
Tom Latham and Devon Conway

స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లండ్‌తో నిన్న (జూన్‌ 25) మొదలైన నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో న్యూజిలాండ్‌ ఓపెనర్లు టామ్‌ లాథమ్‌, డెవాన్‌ కాన్వే చరిత్ర సృష్టించారు. ఈ మ్యాచ్‌లో ఇద్దరూ భారీ శతకాలతో కదంతొక్కి.. తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 317 పరుగులను నెలకొల్పారు. తద్వారా న్యూజిలాండ్‌ టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా వీరు సరికొత్త రికార్డు నెలకొల్పాడు.


1930లో వెల్లింగ్టన్‌లో ఇంగ్లండ్‌పై స్టీవీ డెంప్ స్టర్, జాకీ మిల్స్ 276 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దాదాపు 96 ఏళ్ల తర్వాత ఆ రికార్డును బద్దలుకొడుతూ.. లాథమ్, కాన్వే భారీ భాగస్వామ్యాన్ని(317) నెలకొల్పారు. విదేశీ గడ్డపై న్యూజిలాండ్‌కు ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. 1972లో జార్జ్‌టౌన్‌లో వెస్టిండీస్‌పై న్యూజిలాండ్ ఓపెనర్లు టెర్రీ జార్విస్, గ్లెన్ టర్నర్‌ల చేసిన 387 పరుగులు అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యంగా నిలిచింది.


భారీ సెంచరీల అనంతరం లాథమ్‌ 151 పరుగులు, కాన్వే 157 పరుగుల వద్ద ఔటయ్యారు. ఈ ఇన్నింగ్స్‌లతో లాథమ్‌, కాన్వే మరిన్ని రికార్డులు కూడా తమ ఖాతాలో వేసుకున్నారు. ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన తొలి న్యూజిలాండ్ ఓపెనింగ్ జోడీ రికార్డుల్లోకెక్కారు. ఓపెనర్ లాథమ్ తన టెస్టు కెరీర్‌లో 17వ సెంచరీ నమోదు చేశాడు. న్యూజిలాండ్ కెప్టెన్‌గా ఇంగ్లండ్‌లో టెస్టు శతకం బాదిన తొలి కెప్టెన్‌గా 22 ఏళ్ల రికార్డును తిరగరాశాడు.


లాథమ్-కాన్వే జోడీ మరో అరుదైన ఘనతను కూడా సాధించింది. టెస్టు క్రికెట్‌లో 2వేల పరుగులు పూర్తి చేసిన తొలి న్యూజిలాండ్ ఓపెనింగ్ జోడీగా చరిత్ర సృష్టించింది. అలానే టెస్టుల్లో రెండోసారి 200కిపైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన న్యూజిలాండ్ దిగ్గజ జోడీల జాబితాలో లాథమ్-కాన్వే చేరారు. గతంలో ఈ జాబితో మార్టిన్‌ క్రో-ఆండ్రూ జోన్స్‌, బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌-కేన్‌ విలియమ్సన్‌ ఉన్నారు. కాగా, 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌ తొలి టెస్ట్‌ గెలవగా.. న్యూజిలాండ్‌ రెండో టెస్ట్‌ గెలిచింది. ఈ మ్యాచ్‌ గెలిచిన జట్టు సిరీస్‌ కైవసం​ చేసుకుంటుంది.


ఇవి కూడా చదవండి:

దక్షిణాఫ్రికా సంచలనం

ఒక గండం గడిచింది!

Updated Date - Jun 26 , 2026 | 10:51 AM