Share News

దక్షిణాఫ్రికా సంచలనం

ABN , Publish Date - Jun 26 , 2026 | 05:18 AM

అండర్‌డాగ్‌ దక్షిణాఫ్రికా.. అద్భుత విజయంతో వరల్డ్‌కప్‌లో తొలిసారి నాకౌట్‌కు చేరుకోగా.. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో అదరగొట్టిన బ్రెజిల్‌ గ్రూప్‌-సి విజేతగా నిలిచింది. మొరాకో కూడా తర్వాతి రౌండ్‌కు చేరుకొంది. కాగా,

దక్షిణాఫ్రికా సంచలనం

ఫిఫా కప్‌ మ్యాచ్‌లు

అమెరికా X తుర్కియే

(ఉదయం 7.30)

పరాగ్వే X ఆస్ట్రేలియా

(ఉదయం .7.30)

నార్వే X ఫ్రాన్స్‌

( అర్ధరాత్రి 12.30)

సెనెగల్‌ X ఇరాక్‌

(అర్ధరాత్రి 12.30)

  • 1-0తో కొరియాకు షాక్‌

  • నాకౌట్‌ బెర్త్‌తో చరిత్ర

  • ఫిఫా వరల్డ్‌కప్‌

అండర్‌డాగ్‌ దక్షిణాఫ్రికా.. అద్భుత విజయంతో వరల్డ్‌కప్‌లో తొలిసారి నాకౌట్‌కు చేరుకోగా.. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో అదరగొట్టిన బ్రెజిల్‌ గ్రూప్‌-సి విజేతగా నిలిచింది. మొరాకో కూడా తర్వాతి రౌండ్‌కు చేరుకొంది. కాగా, గ్రూప్‌-బి నుంచి స్విట్జర్లాండ్‌, కెనడాతోపాటు బోస్నియా హెర్జ్‌గోవినా అనూహ్య రీతిలో రౌండ్‌-32కు చేరుకొంది.

గ్వాడలహార (మెక్సికో): సంచలనం సృష్టించిన దక్షిణాఫ్రికా జట్టు.. ఫిఫా వరల్డ్‌కప్‌ చరిత్రలోనే తొలిసారి నాకౌట్‌ రౌండ్‌కు దూసుకెళ్లింది. గ్రూప్‌-ఎలో గురువారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 1-0తో కొరియాకు షాకిచ్చింది. తపేలో మసేకో (63వ నిమిషం) ఏకైక గోల్‌ చేశాడు. సౌతాఫ్రికా జట్టు తొలి మ్యాచ్‌లో మెక్సికో చేతిలో ఓడినా.. చెక్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకొంది. ఇక, ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో విజయంతో గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచి రౌండ్‌-32 బెర్త్‌ను పట్టేసింది. దక్షిణాఫ్రికా 1998, 2002, 2010లో మెగా ఈవెంట్‌లో బరిలోకి దిగినా.. ఎన్నడూ నాకౌట్‌ చేరలేదు. నాకౌట్‌లో కెనడాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన కొరియా దాదాపు 80 శాతం బంతిపై ఆధిపత్యం ప్రదర్శించింది. కానీ, గోల్‌ మాత్రం చేయలేక పోయింది. కాగా, గ్రూప్‌లో మూడో స్థానంలో నిలిచిన కొరియా.. తర్వాతి రౌండ్‌కు చేరుకొనే విషయమై కొంత వేచిచూడాల్సిన పరిస్థితి. అయితే, మెక్సికో గ్రూప్‌-ఎ విన్నర్‌గా నిలిచింది. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో మెక్సికో 3-0తో చెక్‌ను చిత్తు చేసింది. మాటో చావెజ్‌ (55వ), జూలియన్‌ క్వినోనెస్‌ (61వ), అల్వరో ఫిడాల్గో (90+4వ) మెక్సికోకు గోల్స్‌ అందించారు. తొలిసారి గ్రూప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన మెక్సికో మొత్తం 9 పాయింట్లతో టాప్‌లో నిలిచింది.


గులెర్మోకు వీడ్కోలు?

మెక్సికో కీపర్‌ గులెర్మో ఒచో రికార్డు సృష్టించాడు. మెస్సీ, రొనాల్డో తర్వాత ఆరో వరల్డ్‌కప్‌ ఆడిన ఆటగాడిగా.. తొలి గోల్‌కీపర్‌గా నిలిచాడు. చెక్‌తో మ్యాచ్‌లో చివరి 13 నిమిషాల సమయంలో.. గులెర్మో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు.

6-Sports.jpg

గ్రూప్‌ టాపర్‌ బ్రెజిల్‌

మయామి గార్డెన్స్‌ (యూఎస్‌): వినీసియస్‌ జూనియర్‌ డబుల్‌ ధమాకాతో.. టోర్నీ ఫేవరెట్‌ బ్రెజిల్‌ గ్రూప్‌-సి టాపర్‌గా నాకౌట్‌కు చేరుకొంది. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో బ్రెజిల్‌ 3-0తో స్కాట్లాండ్‌ను చిత్తు చేసింది. వినీసియస్‌ (7వ, 45+3వ నిమిషం) రెండో గోల్స్‌ చేయగా.. మాథియాస్‌ కున్హా (30వ) ఓ గోల్‌ అందించాడు. గాయం నుంచి కోలుకొన్న స్టార్‌ ప్లేయర్‌ నెమార్‌ 76వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల నుంచి రెండు విజయాలు, ఓ డ్రాతో మొత్తం 7 పాయింట్లు సాధించిన సాంబా టీమ్‌.. మెరుగైన గోల్స్‌ తేడాతో గ్రూప్‌లో అగ్రస్థానం దక్కించుకొంది. కాగా, ఇదే గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన మొరాకో కూడా రౌండ్‌-32 బెర్త్‌ పట్టేసింది. తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో మొరాకో 4-2తో హైతీపై గెలిచింది. గ్రూప్‌లో మూడోస్థానంలో ఉన్న స్కాట్లాండ్‌ నాకౌట్‌ ఆశలు సజీవంగానే ఉన్నా.. హైతీ కథ ముగిసింది.

బోస్నియా తొలిసారి..

వాంకోవర్‌ (కెనడా): స్విట్జర్లాండ్‌ గ్రూప్‌-బి విజేతగా నిలవగా.. బోస్నియా హెర్జ్‌గోవినా తొలిసారి నాకౌట్‌ బెర్త్‌తో రికార్డు సృష్టించింది. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో స్విస్‌ 2-1తో కెనడాపై గెలిచింది. రూబెన్‌ వార్గస్‌ (46వ), మజాంబి (57వ) చెరో గోల్‌తో స్విస్‌ 2-0తో నిలిచింది. అయితే, 76వ నిమిషంలో కెనడా ప్లేయర్‌ ప్రామిస్‌ డేవిడ్‌ గోల్‌ చేశాడు. ఇదే గ్రూప్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో బోస్నియా హెర్జ్‌గోవినా 3-1తో కతార్‌పై నెగ్గింది. ఆడిన మూడు మ్యాచ్‌ల నుంచి స్విట్జర్లాండ్‌ మొత్తం 7 పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానంతో నాకౌట్‌ చేరుకొంది. ఇక, కెనడా, బోస్నియాలు చెరో 4 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో నిలిచి రౌండ్‌-32 బెర్త్‌లను దక్కించుకొన్నాయి.

ఇవి కూడా చదవండి:

పెళ్లి పేరుతో మోసం.. స్టార్ క్రికెటర్‌పై సంచలన ఆరోపణలు!

కన్నీళ్లు పెట్టుకున్న బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్!

Updated Date - Jun 26 , 2026 | 05:19 AM