చిన్నోడికి చాన్సిస్తారా?
ABN , Publish Date - Jun 26 , 2026 | 05:10 AM
ఐపీఎల్ అనంతరం మరో ధనాధన్ పోరు అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. వరుసగా రెండోసారి టీ20 వరల్డ్‌కప్ సాధించాక టీమిండియా తొలిసారి బరిలోకి దిగబోతోంది. నేటి నుంచి...
వైభవ్ అరంగేట్రంపైనే అందరి దృష్టి
శ్రేయాస్ ఆధ్వర్యంలో బరిలోకి భారత్
నేటి నుంచి ఐర్లాండ్‌తో టీ20 సిరీస్
సా. 6 గం. నుంచి సోనీ స్పోర్ట్స్‌లో..
బెల్‌ఫాస్ట్: ఐపీఎల్ అనంతరం మరో ధనాధన్ పోరు అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. వరుసగా రెండోసారి టీ20 వరల్డ్‌కప్ సాధించాక టీమిండియా తొలిసారి బరిలోకి దిగబోతోంది. నేటి నుంచి ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్ జరుగనుంది. అలాగే ఈసారి నూతన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆధ్వర్యంలో భారత్ తమ ప్రస్థానాన్ని ఆరంభించబోతోంది. అంతేకాకుండా శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌పై అందరి దృష్టీ నెలకొంది. ఎందుకంటే 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ జాతీయ జట్టుతో పాటే ఉన్న విషయం తెలిసిందే. ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్లను సాధికారికంగా ఎదుర్కొంటున్న వైభవ్ ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేస్తాడా? లేదా? అని అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే వైభవ్ ఆట ఎలా ఉన్నా అతడికి తుది జట్టులో చోటు అంత సులువు కాదు. ఇప్పటికే టాప్-3 స్థానాల్లో అభిషేక్, శాంసన్, ఇషాన్ ఉన్నారు. టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో ఈ త్రయం హాఫ్ సెంచరీలతో అదరగొట్టింది. వైభవ్‌ను ఆడించాలనుకుంటే శాంసన్ లేక అభిషేక్‌లలో ఒకరిపై వేటు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ శాంసన్‌ను 4,5 స్థానాల్లో ఆడించాలనుకున్నా అక్కడ శ్రేయాస్, తిలక్ బరిలోకి దిగనున్నారు. ఇక ఆరో స్థానంలో ఆల్‌రౌండర్ ఆడడం పరిపాటి. అయినా శాంసన్‌ను అక్కడ ఆడిస్తే భారత్ కేవలం ఐదుగురు బౌలర్లతోనే పోటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే బౌలింగ్‌లో బుమ్రా, సిరాజ్, వరుణ్ అందుబాటులో లేరు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే వైభవ్‌కు చాన్స్ ఇద్దామా? లేక విజయవంతమైన కూర్పుతోనే ముందుకెళదామా? అనే నిర్ణయం కోచ్, కెప్టెన్ చేతుల్లోనే ఉంది. వైభవ్‌జట్టులో ఉండడంతో శాంసన్, అభిషేక్‌లపై ఒత్తిడి ఉంటుందనడంలో సందేహం లేదు. పేసర్ హర్షిత్ గాయం నుంచి కోలుకోవడం సానుకూలాంశం కానుంది. అయితే తనకు ప్రసిద్ధ్, ప్రిన్స్ యాదవ్‌ల నుంచి పోటీ ఉంది. ఇదిలావుండగా ఐర్లాండ్ జట్టు మాత్రం అడెయిర్, లిటిల్, స్టిర్లింగ్, కాంఫర్‌లాంటి కీలక ఆటగాళ్లు గాయాలతో దూరం కావడంతో బలహీనంగా కనిపిస్తోంది. లోర్కాన్ టక్కర్ నేతృత్వంలో భారత్‌ను ఎదుర్కోనున్న ఈ జట్టు డాక్‌రెల్, డెలానీ, టెక్టర్‌పై ఆధారపడి ఉంది.
తుది జట్లు: (అంచనా)
భారత్: శాంసన్, అభిషేక్/సూర్యవంశీ, ఇషాన్, శ్రేయాస్ (కెప్టెన్), తిలక్, సుందర్, దూబే, అక్షర్, అర్ష్‌దీప్, హర్షిత్, ప్రసిద్ధ్/బిష్ణోయ్.
ఐర్లాండ్: టిమ్ టెక్టర్, రాస్ అడెయిర్, హ్యారీ టెక్టర్, టక్కర్ (కెప్టెన్), కాలిట్జ్, డెలానీ, డాక్‌రెల్, హమ్‌ఫ్రేస్, హోలార్డ్, విలియమ్స్, జై ముంద్రా.
పిచ్-వాతావరణం
బాగా పెద్దదైన ఈ బెల్‌ఫాస్ట్ మైదానంలో పిచ్ కొంత స్లోగా ఉండే అవకాశముంది. బౌలింగ్‌కు అనుకూలమైన ఈ పిచ్‌పై భారత యువ ఆటగాళ్లకు కుదురుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు. అలాగే మధ్యాహ్నం తర్వాత ఆకాశం మేఘావృతమై చిన్నపాటి వర్షం కురిసే చాన్సుంది.
ఇవి కూడా చదవండి:
పెళ్లి పేరుతో మోసం.. స్టార్ క్రికెటర్‌పై సంచలన ఆరోపణలు!
కన్నీళ్లు పెట్టుకున్న బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్!