కుశాల్ మెండిస్ సెంచరీ.. కెప్టెన్‌గా తొలి టెస్టులోనే అరుదైన ఘనత!
ABN , Publish Date - Nov 12 , 2026 | 07:09 AM
రావల్పిండి వేదికగా పాకిస్థాన్, శ్రీలంక మధ్య తొలి టెస్ట్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో లంక పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా కుశాల్ మెండిస్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: రావల్పిండి వేదికగా పాకిస్థాన్, శ్రీలంక మధ్య తొలి టెస్ట్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో లంక పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి లంక నాలుగు వికెట్లు కోల్పోయి 404 పరుగుల భారీ స్కోరు చేసింది. ధనంజయ డిసిల్వా (167 నాటౌట్), కెప్టెన్ కుశాల్ మెండిస్ (117 నాటౌట్) శతకాలతో చెలరేగారు. ఈ ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు అజేయంగా 360 బంతుల్లో 249 పరుగులు జోడించారు. కమిందు మెండిస్ (58) హాఫ్ సెంచరీ చేశాడు. పాక్ బౌలర్లలో మహ్మద్ అబ్బాస్, సకిబ్‌ఖాన్‌లు చెరో 2 వికెట్లు పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా కుశాల్ మెండిస్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. శ్రీలంక తరఫున టెస్టుల్లో కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన బ్యాటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. అంతేకాదు, కెప్టెన్‌గా తన తొలి టెస్టులోనే శతకం సాధించిన 37వ క్రికెటర్‌గా మెండిస్ నిలిచాడు. అలానే కెప్టెన్‌గా తన తొలి టెస్టులోనే పాకిస్థాన్‌పై శతకం బాదిన రెండో ఆటగాడిగా కుశాల్ నిలిచాడు. గతంలో 2006లో లార్డ్స్ వేదికగా పాక్‌తో జరిగిన టెస్టులో ఆండ్రూ స్ట్రాస్ (128 పరుగులు) సెంచరీ సాధించాడు.
ఈ మ్యాచ్‌లో ధనంజయ , కుశాల్ ఐదో వికెట్‌కు చేసిన 249 పరుగుల అజేయ భాగస్వామ్యం.. టెస్టుల్లో పాకిస్థాన్‌పై శ్రీలంకకు ఐదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది. 2009లో లాహోర్ వేదికగా శ్రీలంక బ్యాటర్లు ఐదో వికెట్‌కు జోడించిన 207 పరుగుల మునుపటి రికార్డును తాజాగా ఈ జోడీ బ్రేక్ చేసింది.
ఇవి కూడా చదవండి:
శుభ్‌మన్ గిల్ రికార్డును సమం చేసిన ఆర్యవీర్ సెహ్వాగ్