Share News

దేవుడు వరమిచ్చినా..

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:51 AM

దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్న చందాన స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ (శాట్‌) అధికారుల వ్యవహారశైలి తయారైందని...

దేవుడు వరమిచ్చినా..

ఏడాది గడుస్తున్నా విడుదల కాని నగదు ప్రోత్సాహకాలు

ఇషా, దీప్తి ప్రభుత్వ ఉద్యోగాలపై ప్రతిష్టంభన

అధికారుల సమన్వయ లోపంతో నిర్వేదంలో క్రీడాకారులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్న చందాన స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ (శాట్‌) అధికారుల వ్యవహారశైలి తయారైందని క్రీడాకారులు వాపోతున్నారు. ఆసియా క్రీడలు, ప్రపంచ, ఆసియా చాంపియన్‌షి్‌పల్లో పతకాలు సాధిస్తే తమను కనీసం గౌరవించరా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గత ఏడాది జరిగిన పోటీల్లో సత్తా చాటి, రాష్ట్రానికి కీర్తిప్రతిష్టలు తీసుకొచ్చిన క్రీడా కారులకు మూడు నెలల కిందట గచ్చిబౌలి స్టేడియంలో భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష సమక్షంలో సీఎం రేవంత్‌ రెడ్డి చెక్కులు ప్రదానం చేశారు. అయితే, ఇప్పటివరకు ఆ చెక్కులు నగదు రూపంలో మారకపోవడం గమనార్హం. క్రీడాకారులు, వారి కుటుంబ సభ్యులు శాట్‌ కార్యాలయానికి వెళ్లినప్పుడల్లా ట్రెజరీలో డబ్బులు లేవని అధికారులు చెప్పడం పరిపాటిగా మారింది. బధిర షూటర్‌ ధనుష్‌ శ్రీకాంత్‌కు రూ.2.10 కోట్లు, పారా అథ్లెట్‌ జీవాంజి దీప్తికి రూ.50 లక్షలు, షూటర్‌ తని్‌ష్కకు రూ.53.65 లక్షలు, బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు రూ.60 లక్షలు, షూటర్‌ ఇషా సింగ్‌కు రూ.3.25 కోట్ల విలువ గల చెక్కుల్ని పంపిణీ చేశారు. వీరితో పాటు అథ్లెట్‌ అగసర నందినికి రూ.25 లక్షలు, ఆర్చర్‌ చికితకు రూ.75 లక్షల నగదు ప్రోత్సాహకాలు అందాల్సి ఉండగా, ఇప్పటివరకు వాటికి మోక్షం లభించలేదు. సిరాజ్‌, నిఖత్‌కు ఇచ్చినట్టే ఇషా సింగ్‌కు త్వరలో గ్రూప్‌-1 ఉద్యోగం ఇస్తామని, పారా అథ్లెట్‌ దీప్తికి గ్రూప్‌-2 ఉద్యోగం ఇస్తామని సీఎం స్వయంగా ప్రకటించినా ఇంకా వాటిపై ప్రతిష్టంభన కొనసాగుతుండడంపై క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎంఓ, ఆర్థికశాఖతో సమన్వయం చేసుకొని పని చేయాల్సిన శాట్‌ వైఫల్యమే క్రీడాకారుల పాలిట శాపంగా మారిందని క్రీడా సంఘాలు విమర్శిస్తున్నాయి.


స్వాగతం కూడా లేదు..

జపాన్‌ వేదికగా గత నెలలో జరిగిన ఆసియా క్రీడల్లో ఆరుగురు తెలంగాణ క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబర్చి పతకాలు సాధించారు. వీరికి ఇప్పటివరకు స్పోర్ట్స్‌ పాలసీ ప్రకారం ఎలాంటి ప్రోత్సాహకాలు అందకపోవడంతో క్రీడాకారులు నిర్వేదానికి లోనవుతున్నారు. దేశం గర్వించేలా పతకాలు సాధిస్తే, స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి క్రీడాశాఖ ఉన్నతాధికారులు కూడా రాలేదని ఆవేదన చెందుతున్నారు. ఆ మధ్య కనీస అధ్యయనం చేయకుండా జంట నగరాల పరిధిలోని శాట్‌ స్టేడియాల్లో శిక్షణ ఫీజులను పెంచి, క్రీడాకారుల ఆగ్రహానికి గురయ్యారని, ఇప్పుడేమో రాష్ట్రానికి కీర్తిప్రతిష్టలు తీసుకొచ్చిన క్రీడాకారులను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ వార్తలనూ చదవండి:

బంగ్లాదేశ్‌లో అడుగుపెడితే షేక్ హసీనాకు ఉరిశిక్ష అమలు తప్పదు!

ట్రంప్‌నకు నెతన్యాహు ఫోన్ కాల్స్.. ఇరాన్‌పై మళ్లీ దాడులకు ఒత్తిడి..

Updated Date - Nov 11 , 2026 | 05:51 AM