Share News

ట్రంప్‌నకు నెతన్యాహు ఫోన్ కాల్స్.. ఇరాన్‌పై మళ్లీ దాడులకు ఒత్తిడి..

ABN , Publish Date - Nov 10 , 2026 | 01:28 PM

ఇరాన్‌తో యుద్ధానికి ముగింపు పలికి, దౌత్యపరమైన పరిష్కారం దిశగా అడుగులు వేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం మరోసారి సైనిక దాడులు ప్రారంభించాలని ట్రంప్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.

ట్రంప్‌నకు నెతన్యాహు ఫోన్ కాల్స్.. ఇరాన్‌పై మళ్లీ దాడులకు ఒత్తిడి..
Iran US Conflict

వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధానికి ముగింపు పలికి, దౌత్యపరమైన పరిష్కారం దిశగా అడుగులు వేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం మరోసారి సైనిక దాడులు ప్రారంభించాలని ట్రంప్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ట్రంప్‌నకు ప్రతిరోజూ ఫోన్ చేస్తూ ఇరాన్‌పై యుద్ధాన్ని తిరిగి ప్రారంభించాలని కోరుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరగకుండా చూడాలని సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ సహా పలు దేశాల నేతలు ట్రంప్‌పై ఒత్తిడి తెస్తుండటం ఈ పరిణామాలకు ప్రాధాన్యం సంతరించుకుంది.


అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగలడం, ఇరాన్‌పై యుద్ధానికి దేశంలో వ్యతిరేకత పెరుగుతుండటంతో ట్రంప్ తన వైఖరిని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు, యుద్ధానికి ముగింపు పలికేందుకు చర్చలు జరుగుతున్నప్పటికీ ఇరాన్‌పై అమెరికా పరిమిత స్థాయిలో సైనిక దాడులను కొనసాగిస్తోంది. నవంబర్ 3, 6 తేదీల్లో ఇరాన్‌లోని ఖేష్మ్ ద్వీపంపై అమెరికా క్షిపణి దాడులు చేసినట్లు తెలుస్తోంది. నవంబర్ 6న జరిగిన దాడి గురించి ట్రంప్ నేరుగా ప్రస్తావించకపోయినా.. అమెరికా మరోసారి దాడి చేసిన విషయాన్ని ఆయన ధ్రువీకరించారు.


‘మేము చిన్నచిన్న దాడులు చేస్తున్నాం. కానీ అవి లక్ష్యాలను దెబ్బతీస్తున్నాయి. వారు ఒక చిన్న వైమానిక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాన్ని మేము 15 నిమిషాల్లో.. బహుశా ఐదు నిమిషాల్లోనే ధ్వంసం చేశాం. ప్రస్తుతం యథాతథ స్థితిని కొనసాగిస్తున్నాం’ అని ఫ్లోరిడాలోని మీడియాతో ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా, అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఇరాన్‌పై దాడులు చేపట్టాలని ట్రంప్‌ను నెతన్యాహు కోరినట్లు వైట్‌హౌస్ అధికారులు తెలిపారని వార్తలు వెలువడ్డాయి. అయితే, ట్రంప్ మాత్రం సైనిక చర్యకు తొందరపడకుండా చర్చలకు మరికొంత సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి..

ఎన్విడియా సీఈఓ వ్యవహారంపై ఎఫ్‌బీఐ దర్యాప్తు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Nov 10 , 2026 | 01:54 PM