క్రిస్ గేల్‌కు క్షమాపణలు చెప్పిన కీరన్ పొలార్డ్.. ఎందుకంటే..
ABN , Publish Date - Jun 23 , 2026 | 04:33 PM
వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్‌కు అదే జట్టు మాజీ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ క్షమాపణలు చెప్పాడు. 12 ఏళ్లుగా గేల్ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డ్‌ను కీరన్ పొలార్డ్ తాజాగా బద్దలు కొట్టాడు.
స్పోర్ట్స్ డెస్క్: వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్‌కు అదే జట్టు మాజీ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ క్షమాపణలు చెప్పాడు. 12 ఏళ్లుగా గేల్ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డ్‌ను కీరన్ పొలార్డ్ తాజాగా బద్దలు కొట్టాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ప్రపంచ రికార్డ్‌తో క్రిస్ గేల్‌కు పొలార్డ్ క్షమాపణలు తెలియజేశాడు.
మేజర్ లీగ్ క్రికెట్ 2026లో వాషింగ్టన్ ఫ్రీడమ్, ఎంఐ న్యూయార్క్ మధ్య మ్యాచ్ జరిగింది. న్యూయార్క్ తరఫున ఆడిన పొలార్డ్ 56 బంతుల్లోనే సెంచరీతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వాషింగ్టన్ బౌలర్లను ఊచకోత కోశాడు . ఇక ఈ మ్యాచ్‌లో 81 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద.. గేల్ ఆల్‌టైమ్ రికార్డ్‌ను అధిగమించాడు. 39 ఏళ్ల పొలార్డ్ ఇప్పటి వరకు 736 టీ20 మ్యాచ్‌లు ఆడి..14,582 పరుగులు చేశాడు. 14,562 పరగులతో గేల్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఈ మ్యాచ్ అనంతరం పొలార్డ్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. తాము స్ఫూర్తిగా తీసుకునే క్రిస్ గేల్ రికార్డ్‌ను బద్దలు కొట్టడం చాలా ప్రత్యేకమైనదని, యూనివర్స్ బాస్.. క్షమించండని పొలార్డ్ తెలిపాడు. తామిద్దరం ఇప్పుడు అగ్రస్థానంలో ఉన్నామని, ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయడం చాలా కష్టమని వెల్లడించాడు. చాలా మంది టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయాలనుకుంటారని, కానీ ఎవరో ఒకరు లోయర్ ఆర్డర్‌లో వచ్చి మ్యాచ్‌ను ముగించే కష్టమైన పనిని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.
తాను ఆ బాధ్యతనను సవాల్‌గా స్వీకరించానని, టెక్నాలజీలానే క్రికెట్ కూడా మారుతోందని కీరన్ పొలార్డ్ తెలిపాడు. ప్రస్తుతం క్రికెట్ కేవలం ఒక ఆట మాత్రమే కాదని, అదొక వ్యాపారమని అన్నాడు. ఒకప్పుడు తమని విమర్శించిన వారందరూ ఇప్పుడు మౌనంగా మా విజయాలను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నారని కీరన్ పోలార్డ్ చెప్పుకొచ్చాడు. పొలార్డ్, గేల్, బ్రావో వంటి ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌ల కంటే ఫ్రాంచైజీ లీగ్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారని పలువురు మాజీ క్రికెటర్లు వారిపై అప్పట్లో విమర్శించారు.
ఇవి కూడా చదవండి:
భారత జట్టులోకి పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్
ఐపీఎల్‌లో భారీ ట్రేడ్.. ఢిల్లీకి పంత్, లఖ్‌నవూకు కుల్‌దీప్ యాదవ్