Share News

టెస్టుల్లో జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. మూడో బౌలర్‌గా

ABN , Publish Date - Nov 22 , 2026 | 11:46 AM

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే టెస్టు మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లలోనూ తొలి ఓవర్‌లో వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు.

టెస్టుల్లో జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. మూడో బౌలర్‌గా
Jasprit Bumrah

స్పోర్ట్స్ డెస్క్: వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. కివీస్ రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్‌కు శుభారంభం అందించాడు. తాను వేసిన తొలి ఓవర్లలోనే న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్‌ను అద్భుతమైన బంతితో పెవిలియన్‌కు పంపాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లోనూ బుమ్రా మొదటి ఓవర్‌లోనే లాథమ్ వికెట్‌ను పడగొట్టడం విశేషం.


న్యూజిలాండ్ రెండు ఇన్నింగ్స్‌ల తొలి ఓవర్‌లోనే వికెట్లు సాధించడం ద్వారా బుమ్రా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే టెస్టు మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తొలి ఓవర్‌లో వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. బుమ్రా కంటే ముందు శ్రీశాంత్, జహీర్ ఖాన్ మాత్రమే ఈ ఘనత సాధించారు. అలానే న్యూజిలాండ్ టెస్టు బుమ్రాకు మరో మైలురాయిని అందించింది. ఒక టెస్టు మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే అత్యధిక సార్లు వికెట్ తీసిన భారత బౌలర్ కపిల్ దేవ్ రికార్డును బుమ్రా సమం చేశాడు. వీరిద్దరూ తమ టెస్ట్ కెరీర్‌లో ఈ ఘనతను ఏడుసార్లు సాధించారు. ఓవరాల్‌గా తొలి ఓవర్‌లోనే అత్యధిక సార్లు వికెట్ తీసిన బౌలర్ల జాబితాలో మాజీ ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్(29 వికెట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ (26 వికెట్లు) చమింద వాస్(19 వికెట్లు) గ్లెన్ మెక్‌గ్రాత్(19 వికెట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.


ఒకే టెస్టులోని రెండు ఇన్నింగ్స్‌ల్లో తొలి ఓవర్‌లో వికెట్ తీసిన భారత బౌలర్లు

  • ఎస్. శ్రీశాంత్: వెస్టిండీస్‌పై (కింగ్‌స్టన్, 2006)

  • జహీర్ ఖాన్: బంగ్లాదేశ్‌పై (మీర్పూర్, 2007)

  • జస్ప్రీత్ బుమ్రా: న్యూజిలాండ్‌పై (వెల్లింగ్టన్, 2026)

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 720 పరుగుల భారీ స్కోర్ సాధించి.. 352 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కాగా భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (136), రిషభ్ పంత్ (128) శతకాలతో మెరవగా.. యశస్వి జైశ్వాల్‌(85), దేవ్‌దత్త్‌ పడిక్కల్‌(80), శుబ్‌మన్‌ గిల్‌(98), ధ్రువ్‌ జురెల్‌(78) హాఫ్‌ సెంచరీలతో రాణించారు.


ఈ వార్తలనూ చదవండి:

డ్రోన్ దాడి.. మంటల్లో రష్యా సరకు రవాణా నౌక

భారత్‌ వృద్ధిని అడ్డుకునేందుకు చైనా వ్యూహం: అమెరికా కాంగ్రెస్ హెచ్చరిక

Updated Date - Nov 22 , 2026 | 12:07 PM