Share News

కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవడమంటే ఇష్టం: బుమ్రా

ABN , Publish Date - Mar 12 , 2026 | 05:23 PM

భారత క్రికెట్ జట్టు ఫాస్ట్‌ బౌలర్‌ బుమ్రా టీ20 ప్రపంచకప్‌ విజయం గురించి మాట్లాడాడు. ఆ వీడియోను బీసీసీఐ షేర్‌ చేసింది. తనకు కఠిన సవాళ్లు అంటే ఇష్టమని బుమ్రా పేర్కొన్నాడు.

కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవడమంటే  ఇష్టం: బుమ్రా
Jasprit Bumrah T20 World Cup 2026

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన శైలిలో బౌలింగ్ చేస్తూ.. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు. యార్కర్ బంతులను సంధిస్తూ బ్యాటర్లను వణికిస్తుంటాడు. ఓటమి ఖాయమనుకునే మ్యాచుల్లో సైతం తనదైన బౌలింగ్‌తో విజయాలను అందించాడు. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ అందుకు నిదర్శనం. ఈ మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్ భారత్‌కు విజయాన్ని అందించిందని అనడంలో అతిశయోక్తి లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా టీ20 ప్రపంచ కప్ విజయం గురించి బుమ్రా మాట్లాడాడు. ఆ వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) షేర్‌ చేసింది.


ఆ వీడియోలో... ‘నాకు కఠిన సవాళ్లు, క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడం అంటే ఇష్టం. అలాంటి సందర్భాల్లో మంచి ప్రదర్శన చేసి, సత్తా చాటినప్పుడు.. అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. దానిలో వచ్చే ఆనందం మరెక్కడ దొరకదు. నేను గుజరాత్‌లోనే క్రికెట్‌ ఆడటం ప్రారంభించా. ఇప్పుడు ప్రపంచ కప్‌ను కూడా ఇక్కడే సాధించాం. ఫైనల్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ గెలిచింది కూడా ఇక్కడే. ఇవ్వన్ని నాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి’ అని బుమ్రా అన్నాడు.


అహ్మదాబాద్ మైదానంలోనే వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో భారత్‌ తృటిలో టైటిల్‌ను కైవసం చేసుకునే అవకాశాన్ని కోల్పోయింది. ఆ విషయాన్ని బుమ్రా గుర్తు చేసుకున్నాడు. ‘గతంలో మేం తృటిలో ఓడిపోయాం. కానీ ఈ సారి విజయం సాధించాం. చాలా సంతోషంగా ఉంది. వరుసగా రెండు సార్లు టీ20 ప్రపంచకప్‌ గెలవడం అంటే మామూలు విషయం కాదు. దేవుడికి ధన్యవాదాలు’ అని జస్ప్రీత్‌ బుమ్రా అన్నాడు. ఇక చరిత్రాత్మక టీ20 ప్రపంచ కప్ తర్వాత, జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరపున తిరిగి ఆడనున్నాడు.


ఇవి కూడా చదవండి:

అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య కుమార్.. ఎందుకంటే

'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' సంజు కాదు.. డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Mar 12 , 2026 | 05:29 PM