'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' సంజు కాదు.. డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 12 , 2026 | 03:15 PM
సొంతగడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును అందుకున్నాడు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచకప్2026ను భారత జట్టు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి టీమిండియా వరుసగా రెండోసారి పొట్టి ప్రపంచకప్ కైవసం చేసుకుంది. ఈ చరిత్రాత్మక విజయంలో వికెట్ కీపర్, బ్యాటర్ సంజు శాంసన్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అందుకే శాంసన్‌ను ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా ఎంపిక చేసింది. అయితే అవార్డు సంజుకు ప్రకటించడంపై సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్(AB de Villiers) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే...
తాజాగా ఏబీ డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానల్‌లో టీ20 ప్రపంచ కప్2026పై రివ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్(POTM) గురించి కూడా ప్రస్తావించాడు. 'సంజు శాంసన్, బుమ్రాలో ఎవరు ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీ అన్నది నిర్ణయించడం చాలా కష్టం. ఈ టోర్నమెంట్ లో బుమ్రా(Jasprit Bumrah ) అత్యధిక వికెట్లు తీశాడు. కాబట్టి అతడు కూడా ఈ అవార్డు రేసులో ఉన్నాడు. కానీ నా వరకు అయితే బుమ్రాకే ఆ అవార్డు ఇవ్వాల్సింది. ఎందుకంటే అతడు వేసిన కొన్ని కీలకమైన స్పెల్‌ల కారణంగానే భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్, న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో బుమ్రా బౌలింగ్ నిజంగా అద్భుతం. అతడొక్కడే వేరే గ్రహంలో ఉన్నట్లు బౌలింగ్ చేశాడు. టీమిండియాకు అతడొక విలువైన ఆస్తి' అని డివిలియర్స్ పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచ కప్2026లో బుమ్రా సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో బుమ్రా తన అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన సంగతి అందరికి తెలుసు. కివీస్‌తో జరిగిన ఫైనల్లోనూ బుమ్రా బంతితో మ్యాజిక్ చేశాడు. 4 వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. మొత్తంగా ఈ టోర్నీలో 8 ఇన్నింగ్స్‌ల్లో 14 వికెట్లు పడగొట్టి వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy)తో కలిసి సంయుక్తంగా టాప్ వికెట్ టేకర్‌గా బుమ్రా నిలిచాడు.
ఇవి కూడా చదవండి:
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. వెస్టిండీస్ క్రికెటర్‌కు భారీ షాక్
ఐపీఎల్2026 ప్రారంభానికి ముందు ధోనికి భారీ ఊరట