మనకు సవాల్ విసిరే సామర్థ్యం పాకిస్థాన్‌కు లేదు: ఇర్ఫాన్ పఠాన్
ABN , Publish Date - Feb 07 , 2026 | 09:33 AM
టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ ప్రకటించడంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ఈ విషయంలో పాక్ కచ్చితంగా యూటర్న్ తీసుకుంటుందన్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచకప్(T20 World Cup-2026)లో షెడ్యూల్ ప్రకారం ఈనెల 15న శ్రీలంకలోని కొలంబో వేదికగా భారత్, పాకిస్థాన్‌ల మధ్య లీగ్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలుస్తోన్న పాక్.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాక్ నిర్ణయంపై టీమిండియా మాజీ క్రికెటర్లతో సహా ఇతర దేశాల మాజీలూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాక్ నిర్ణయంపై తాజాగా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) స్పందించాడు. ఈ మ్యాచ్ విషయంలో పాక్ కచ్చితంగా యూటర్న్ తీసుకుంటుందన్నాడు.
తన యూట్యూబ్ ఛానల్‌లో టీ20 ప్రపంచ కప్-2026 గురించి ఇర్ఫాన్ పలు విషయాలను వెల్లడించాడు. ‘గ్రూప్ స్టేజ్‌లో మనకు పెద్దగా సవాళ్లు లేవు. అలానే టీమిండియాతో మ్యాచ్‌ను బహిష్కరించాలని పాక్ నిర్ణయం తీసుకుంది. కానీ ఏ సమయంలోనైనా వారు యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ వారు యూటర్న్ తీసుకున్నా.. మనకు సవాల్ విసరగల సామర్థ్యం వారికి ఉందా? గత వరల్డ్ కప్‌లో భారత్, పాక్ మ్యాచ్‌లను తీసుకుంటే.. ఆ జట్టు మనకు ఛాలెంజ్ విసిరే పరిస్థితులు కనిపించడం లేదు. ఆ జట్టుపై భారత్ మూడుసార్లు ఆసియా కప్(Asia Cup-2025) టోర్నీలో గెలిచింది. పాక్ మీద భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది’ అని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు.
ఫిబ్రవరి 15న భారత్‌తో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ను బహిష్కరించాలని పాక్ తీసుకున్న నిర్ణయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) కూడా తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయం 'క్రీడా స్ఫూర్తికి విరుద్ధం' అని అభివర్ణించింది.
మరోవైపు మరికొన్ని గంటల్లోనే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. మొదటి మ్యాచ్ పాకిస్థాన్, నెదర్లాండ్ మధ్య కొలంబో వేదికగా జరగనుంది. రెండో మ్యాచ్‌లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్, స్కాట్లాండ్ తలపడనున్నాయి. మూడో మ్యాచ్ భారత్, యూఎస్‌ఏ మధ్య ముంబైలోని వాంఖడే వేదికగా రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.
ఇవీ కూడా చదవండి:
అండర్-19 ప్రపంచ కప్ విజేత భారత్
అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో వైభవ్ అరుదైన రికార్డ్