Share News

జోరు సాగనీ..

ABN , Publish Date - Nov 07 , 2026 | 12:46 AM

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో బోణీ చేసిన భారత జట్టు మరో విజయంపై కన్నేసింది. శనివారం ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరుగనుంది.

జోరు సాగనీ..
India vs New Zealand 2nd ODI

  • అందుబాటులో పేసర్‌ సిరాజ్‌

  • న్యూజిలాండ్‌తో భారత్‌ రెండో వన్డే నేడు

  • ఉ. 7.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో..

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో బోణీ చేసిన భారత జట్టు మరో విజయంపై కన్నేసింది. శనివారం ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరుగనుంది. అనుభవం లేని బౌలర్లు ఏమేరకు రాణిస్తారనే సందేహాలను పటాపంచలు చేస్తూ.. ఆక్లాండ్‌లో పేసర్లు అదరగొట్టారు. ముఖ్యంగా అర్ష్‌దీప్‌, అన్షుల్‌, గుర్నూర్‌ బ్రార్‌ అంచనాలకు మించి రాణించారు. వీరి అద్భుత ప్రదర్శన కారణంగానే కివీస్‌ తొలి మ్యాచ్‌లో కనీసం 200 పరుగులైనా చేయలేకపోయింది. ఆల్‌రౌండర్ల వైపు మొగ్గు చూపే కోచ్‌ గంభీర్‌ తన ప్రాధాన్యతను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఈ పేస్‌ త్రయం నిరూపించినట్టయింది. ఇక నేటి రెండో వన్డేకు పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ కూడా అందుబాటులో ఉండనున్నాడు. ఈడెన్‌ పార్క్‌లో స్ట్రయిట్‌ బౌండరీలు చిన్నగా ఉన్నట్టే, స్థానిక హెన్రీ స్టేడియంలో స్క్వేర్‌ బౌండరీలు తక్కువ దూరంలో ఉంటాయి. దీనికి అనుగుణంగా పేసర్లు తమ లెంగ్త్‌ను సరిచూసుకోవాల్సి ఉంటుంది. అటు ఆతిథ్య కివీస్‌తో వన్డే సిరీస్‌లో తొలి విజయం కోసం ఎదురుచూస్తోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోవడంతో ఈడెన్‌లో చిత్తుగా ఓడాల్సి వచ్చింది. తమ లోపాలను సరిచేసుకుంటేనే టీమిండియాను అడ్డుకునే అవకాశం ఉంటుంది.


పేసర్లే కీలకం: నేటి మ్యాచ్‌లోనూ భారత పేసర్లు కీలకంగా నిలిచే అవకాశం ఉంది. అన్షుల్‌ కాంబోజ్‌ తొలి వన్డేలో ఏకంగా 46 డాట్‌ బాల్స్‌ వేయడం విశేషం. నిలకడగా తను టెస్టు మ్యాచ్‌ బౌలింగ్‌ లెంగ్త్‌ను రాబట్టి కివీస్‌ బ్యాటర్లను పరుగులు తీయకుండా కట్టడి చేశాడు. అయితే నలుగురు పేసర్లలో అకీబ్‌ నబీ మాత్రం నిరాశపర్చడమే కాకుండా కనీసం ఓ వికెట్‌ తీయలేకపోయాడు. నేటి మ్యాచ్‌లో సిరాజ్‌ అతడి స్థానంలో బరిలోకి దిగడం ఖాయమే. అదే జరిగితే పేస్‌ విభాగం మరింత పటిష్టం కానుంది. అలాగే బ్యాటింగ్‌లో వెటరన్‌ రోహిత్‌ ఖాతా తెరవలేకపోయాడు. అయితే తను స్వదేశంలో విండీస్‌పై మూడు వన్డేల్లో ఓ శతకంతో 225 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. అదే ఫామ్‌ను కివీస్‌ గడ్డపై మిగిలిన మ్యాచ్‌ల్లో చూపితే జట్టు భారీ స్కోర్లకు ఢోకా ఉండదు. విరాట్‌ మాత్రం కివీస్‌ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నాడు. ఎక్స్‌ట్రా బౌన్స్‌ బంతులు సైతం అతడిని ఇబ్బందిపెట్టలేకపోయాయి. కెప్టెన్‌ గిల్‌ నుంచి భారీ ఇన్నింగ్స్‌ రావాల్సి ఉంది. ఇతర బ్యాటర్లు షార్ట్‌ బాల్స్‌ ఆడడంలో ఇబ్బందిపడ్డారు. శ్రేయాస్‌, అక్షర్‌ బౌన్సర్లను ఆడలేకపోయారు. ఈ మ్యాచ్‌లో తమ లోపాలను సరిచేసుకోవాలనుకుంటున్నారు.


డెవాన్‌ కాన్వే అవుట్‌

తొలి వన్డే ఓటమితో ఇబ్బందిపడుతున్న న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే కంకషన్‌ కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో సైఫర్ట్‌ మిగిలిన మ్యాచ్‌లను కూడా ఆడే చాన్సుంది. అలాగే నాలుగు, ఐదు వన్డేలకు మాత్రమే ఎంపికైన నిక్‌ కెల్లీని మిగతా మ్యాచ్‌లకు కూడా తీసుకున్నారు. అటు తొలి వన్డేకు దూరమైన పేసర్‌ మ్యాట్‌ హెన్రీ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగవచ్చు. బ్యాటింగ్‌లో ఓపెనర్‌ యంగ్‌, నికోల్స్‌, లాథమ్‌ సత్తా చూపాల్సి ఉంది. ఫిలిప్స్‌, మిచెల్‌ కీలకం కానున్నారు.

వరుణుడితో ముప్పు

తొలి మ్యాచ్‌ తరహాలోనే వెల్లింగ్టన్‌లోనూ వరుణుడు అడ్డుపడే అవకాశం కనిపిస్తోంది. శుక్రవారం కురిసిన వర్షానికి భారత జట్టు ప్రాక్టీస్‌ సెషన్‌ కూడా రద్దు చేసుకోవాల్సి వచ్చింది. కివీస్‌ మాత్రం ఇండోర్‌లో ప్రాక్టీస్‌ కొనసాగించింది. ఇక మ్యాచ్‌ రోజైన శనివారం పగటి పూట 60 శాతం, రాత్రి 55 శాతం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో మ్యాచ్‌ సజావుగా సాగడంపై సందేహాలు నెలకొన్నాయి. అటు పిచ్‌ మాత్రం పేసర్లకు అనుకూలించనుంది. ఈ వేదికపై చివరి వన్డేలో ఇంగ్లండ్‌ 44 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.

తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌, గిల్‌ (కెప్టెన్‌), విరాట్‌, శ్రేయాస్‌, అక్షర్‌, రాహుల్‌, నమన్‌, అన్షుల్‌, సిరాజ్‌/నబీ, గుర్నూర్‌, అర్ష్‌దీప్‌.

న్యూజిలాండ్‌: సైఫర్ట్‌, యంగ్‌, నికోల్స్‌, మిచెల్‌, లాథమ్‌, ఫిలిప్స్‌, శాంట్నర్‌ (కెప్టెన్‌), స్మిత్‌, జేమిసన్‌, డఫీ/హెన్రీ, టిక్నెర్‌.


ఈ వార్తలనూ చదవండి:

నా భార్య క్యాన్సర్ పోరాటం.. నా జీవితాన్ని మార్చేసింది: కివీస్ ప్లేయర్

ప్రధానిని కలిసిన సూర్యకుమార్ యాదవ్.. చిన్నారులతో సరదాగా గడిపిన మోదీ..

బంగ్లాదేశ్ క్రికెటర్‌కు తీవ్ర గాయం.. స్ట్రెచర్‌పై తరలింపు!

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 01:01 AM