తొలి రోజు సమంగా.. రెండో టెస్టు
ABN , Publish Date - Nov 28 , 2026 | 01:18 AM
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా ఆరంభమైంది. బ్యాట్‌కు బంతికి సమతూకంగా సాగిన తొలి రోజు ఆటలో ఇరు జట్ల నుంచి పోరాటం కనిపించింది.
న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ 246/5
లాథమ్, బ్లండెల్ అర్ధసెంచరీలు జూఫర్వాలేదనిపించిన భారత పేసర్లు
టెస్టుల్లో తొలి 33 మ్యాచ్‌లను విభిన్న వేదికలపై ఆడిన బ్యాటర్‌గా సంజయ్ మంజ్రేకర్‌తో సమంగా నిలిచిన యశస్వీ జైస్వాల్.
బుమ్రా టెస్టు కెరీర్‌లో మొదటి రోజు ఆటలో ఎక్కువ ఓవర్లు (19) వేసినా వికెట్ తీయలేకపోవడం ఇదే తొలిసారి.
క్రైస్ట్‌చర్చ్: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా ఆరంభమైంది. బ్యాట్‌కు బంతికి సమతూకంగా సాగిన తొలి రోజు ఆటలో ఇరు జట్ల నుంచి పోరాటం కనిపించింది. అయితే మొదటి, చివరి సెషన్లలో ఆతిథ్య కివీస్ బ్యాటర్లదే హవా సాగింది. రెండో సెషన్‌లో మాత్రం భారత బౌలర్లు మూడు వికెట్లతో ఒత్తిడి పెంచగలిగారు. పేసర్ ఆకాశ్ దీప్ (2/52) పదునైన బంతులతో ప్రభావం చూపాడు. అయితే 110/4 స్కోరుతో ఇక్కట్లలో పడిన జట్టును బ్లండెల్ (53 బ్యాటింగ్) అజేయ హాఫ్ సెంచరీతో ఆదుకోగా.. ఫిలిప్స్ (36 బ్యాటింగ్), మిచెల్ (31) అతడికి సహకరించారు. దీంతో శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సరికి మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 246/5 స్కోరు చేసింది. కెప్టెన్ లాథమ్ (59) కూడా అర్ధసెంచరీ సాధించాడు. సుందర్, అరంగేట్రం ఆటగాడు బ్రార్, అన్షుల్‌లకు ఒక్కో వికెట్ దక్కగా, స్టార్ పేసర్ బుమ్రా తేలిపోయాడు. మరోవైపు ఈ టెస్టులోనూ సిరాజ్, జడేజాలకు చోటు దక్కలేదు.
ఓపెనర్ల శుభారంభం: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఇన్నింగ్స్ దీటుగానే ఆరంభమైంది. ఓపెనర్లు లాథమ్, కాన్వే మొదటి వికెట్‌కు 77 పరుగులు జోడించారు. తొలి టెస్టులో ఖాతా తెరవలేకపోయిన కెప్టెన్ లాథమ్ ఈసారి సత్తా చూపాడు. అయితే ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ఎల్బీ అవుట్ నిర్ణయంపై రివ్యూకు వెళ్లి, హ్యాట్రిక్ డకౌట్ల ప్రమాదం నుంచి గట్టెక్కాడు. ఆ తర్వాత అతడిచ్చిన క్యాచ్‌ను రాహుల్ అందుకోలేకపోయాడు. ఆరంభంలో భారత పేసర్లు కొన్ని చక్కటి బంతులతో ఇబ్బందిపెట్టాలని చూసినా ఓపెనర్లు జాగ్రత్తగా ఆడారు. లంచ్ బ్రేక్‌కు ముందు కాన్వేను బ్రార్ అవుట్ చేయగలిగాడు.
బౌలర్ల జోరు: రెండో సెషన్‌లో పేసర్ ఆకాశ్ కివీస్‌ను వణికించాడు. కెప్టెన్ గిల్ అతడి బౌలింగ్ ఎండ్‌ను పోర్ట్ హిల్ నుంచి బొటానికల్ గార్డెన్ వైపు మార్చి ఫలితం రాబట్టాడు. ముందుగా అర్ధసెంచరీ పూర్తి చేసుకుని క్రీజులో కుదురుకున్న లాథమ్‌ను ఆకాశ్ చక్కటి లెంగ్త్ బాల్‌తో అవుట్ చేశాడు. కీపర్ పంత్ అతడి క్యాచ్‌ను అందుకున్నాడు. తర్వాతి ఓవర్‌లోనే నికోల్స్ (16)ను పేసర్ అన్షుల్ పెవిలియన్‌కు చేర్చాడు. ఆ వెంటనే ఆకాశ్ మరోసారి చెలరేగి రచిన్ రవీంద్రను డకౌట్ చేయడంతో ఒక్క పరుగు చేరకుండానే మూడు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో కివీస్ 110/4 స్కోరుతో తీవ్ర ఒత్తిడిలో పడగా, అటు భారత బౌలర్లు మ్యాచ్‌పై పట్టు బిగించినట్టు కనిపించింది.
చివర్లో పోరాటం: 131/4 స్కోరుతో ఆఖరి సెషన్ ఆరంభించిన కివీస్‌కు మిచెల్, బ్లండెల్ జోడీ అండగా నిలిచింది. ఉత్సాహంగా ఈ సెషన్‌ను మొదలుపెట్టిన బౌలర్లను విసిగిస్తూ వీరిద్దరు క్రీజులో కుదురుకున్నారు. నిలకడగా ఆడేస్తూ అడపాదడపా బౌండరీలతో స్కోరుబోర్డును కదిలించారు. చివరకు ఐదో వికెట్‌కు 74 పరుగులు జత చేరాక స్పిన్నర్ సుందర్ భారత్‌కు రిలీఫ్‌నిచ్చాడు. అతడి ఓవర్‌లో మిచెల్ క్యాచ్‌ను లెగ్ స్లిప్‌లో జురెల్ అద్భుతంగా పట్టేశాడు. ఆ తర్వాత బ్లండెల్‌కు ఫిలిప్స్ సహకారం అందించాడు. ఈ ఇద్దరూ మరో వికెట్ కోల్పోకుండా తొలి రోజును ముగించగా, బ్లండెల్ తన 50వ టెస్టులో హాఫ్ సెంచరీ పూర్తిచేయడం విశేషం. ఈ సెషన్‌లో కివీస్ 115 పరుగులు చేయగా.. ఈ జోడీ ఆరో వికెట్‌కు అజేయంగా 62 పరుగులు జత చేసింది.
స్కోరుబోర్డు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (సి) పంత్ (బి) ఆకాశ్ 59, కాన్వే (ఎల్బీ) బ్రార్ 31, నికోల్స్ (సి) ఆకాశ్ (బి) అన్షుల్ 16, రచిన్ (సి) పంత్ (బి) ఆకాశ్ 0, మిచెల్ (సి) జురెల్ (బి) సుందర్ 31, బ్లండెల్ (బ్యాటింగ్) 53, ఫిలిప్స్ (బ్యాటింగ్) 36; ఎక్స్‌ట్రాలు: 20; మొత్తం: 85 ఓవర్లలో 246/5. వికెట్ల పతనం: 1-77, 2-110, 3-110, 4-110, 5-184. బౌలింగ్: బుమ్రా 19-4-37-0, అన్షుల్ 17-5-56-1, ఆకాశ్ 21-6-52-2, బ్రార్ 19-4-52-1, సుందర్ 9-1-36-1.
ఇవి కూడా చదవండి:
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. అధికారిక ప్రకటన విడుదల
వైభవ్ సూర్యవంశీకి ప్రపంచకప్‌లో ఛాన్స్ ఇవ్వాలి: శ్రీకాంత్
ఓవరాక్షన్ తగ్గించుకో.. హర్షిత్ రాణాపై నెటిజన్లు ఫైర్!