Share News

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన దీప్తి శర్మ

ABN , Publish Date - Sep 08 , 2026 | 06:42 PM

ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ అదరగొట్టింది. మహిళా టీ20 ఆసియా కప్ 2026లో అద్భుత ప్రదర్శనలు చేస్తున్న ఆమె.. తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకుంది.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన దీప్తి శర్మ
ICC T20 rankings 2026

స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ అదరగొట్టింది. మహిళా టీ20 ఆసియా కప్ 2026లో అద్భుత ప్రదర్శనలు చేస్తున్న ఆమె, బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి 6వ స్థానానికి చేరింది. మరో భారత బౌలర్‌, తెలుగు తేజం శ్రీ చరణి నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. వీరిద్దరు మినహా మరే భారత బౌలర్‌ టాప్-10లో లేరు.


ఆసియా కప్‌2026లో దీప్తి అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేస్తోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కేవలం 1.90 ఎకానమీతో 8 వికెట్లు పడగొట్టింది. గత ఏడాది డిసెంబర్‌లో దీప్తి శర్మ అగ్రస్థానంలో ఉండగా.. ఇటీవలే శ్రీ చరణి ఆమెను అధిగమించింది. శ్రీచరణి, దీప్తిల మధ్య దక్షిణాఫ్రికాకు చెందిన నోన్‌కులేకో మ్లాబా, ఇంగ్లండ్‌కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్, చార్లీ డీన్, లారెన్ బెల్ ఉన్నారు. వీరిద్దరి మధ్య 70 పాయింట్ల వ్యత్యాసం ఉంది. దీప్తి తనకంటే ముందు ఉన్న థాయిలాండ్‌కు చెందిన థిపాచా, పుత్తావోంగ్‌లను అధిగమించి 6వ స్థానంలో నిలిచింది.


బ్యాటింగ్ విభాగంలో టీమిండియా ప్లేయర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్‌ 5, 7, 10 స్థానాల్లో ఉన్నారు. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్‌ బెత్‌ మూనీ తన టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. ఇక ఆసియా కప్ 2026లో టీమిండియా విషయానికి వస్తే.. పాకిస్థాన్‌పై విజయంతో సెమీస్‌కు అర్హత సాధించింది. ఇవాళ బంగ్లాదేశ్‌-యూఏఈ మ్యాచ్‌ విజేతతో భారత్‌ సెమీస్‌లో తలపడుతుంది. మరోవైపు పాకిస్థాన్‌, శ్రీలంక రెండో సెమీస్‌లో పోటీపడతాయి. భారత్‌ మ్యాచ్‌ సెప్టెంబర్‌ 10న, శ్రీలంక-పాక్‌ మ్యాచ్‌ సెప్టెంబర్‌ 11న జరగనున్నాయి.


ఇవి కూడా చదవండి:

'షుగర్ డాడీని కూడా చంపేస్తా'.. గువాహటి ఘటన నిందితుడి కీలక వ్యాఖ్యలు

యూఎస్ ఓపెన్2026లో ముగిసిన నవోమి ఒసాకా ప్రయాణం

Updated Date - Sep 08 , 2026 | 07:31 PM