కివీస్‌తో టెస్ట్ కోసం జట్టును ప్రకటించిన ఇంగ్లండ్.. ఒకేసారి ముగ్గురికి
ABN , Publish Date - May 13 , 2026 | 07:59 PM
స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో తలపడేందుకు ఇంగ్లండ్ పురుషుల క్రికెట్ జట్టు సిద్దమైంది. జూన్ 4 నుంచి లార్డ్స్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇవాళ ప్రకటించింది.
స్పోర్ట్స్ డెస్క్: స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో తలపడేందుకు ఇంగ్లండ్ పురుషుల క్రికెట్ జట్టు సిద్దమైంది. జూన్ 4 నుంచి లార్డ్స్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇవాళ(బుధవారం) ప్రకటించింది. జట్టులోకి ఒకేసారి ముగ్గురు కొత్త ఆటగాళ్లను సెలెక్టర్లు ఎంపిక చేశారు.
బ్యాటర్ ఎమిలియో గే, ఫాస్ట్ బౌలర్ సోనీ బేకర్, వికెట్ కీపర్ బ్యాటర్ జేమ్స్ రూ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఇదే సమయంలో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న వైస్ కెప్టెన్ ఓలీ పోప్, ఓపెనర్ జాక్ క్రాలీలపై వేటుపడింది. గాయం కారణంగా దాదాపు 3 నెలలుగా పోటీ క్రికెట్‌కు దూరమైన కెప్టెన్ బెన్ స్టోక్స్ జట్టులోకి తిరిగొచ్చాడు. ఫిబ్రవరిలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బంతి బలంగా తగలడంతో స్టోక్స్ దవడ ఎముక విరిగిన సంగతి తెలిసిందే.
ఇటీవలే కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో దుర్హం తరఫున స్టోక్స్ బరిలోకి దిగి సత్తాచాటాడు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో వైస్ కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వ్యహరించే అవకాశముంది. బెథెల్, రెహాన్ ఇద్దరూ తమ ఐపీఎల్ 2026 బాధ్యతలను పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి జట్టులోకి రావచ్చని ఈసీబీ హామీ ఇచ్చింది. ఐపీఎల్ 2026 మే 31న ముగుస్తుంది. కాగా ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ జూన్ 4న ప్రారంభమవుతుంది. అలానే తొలి టెస్టు కోసం ప్రకటించిన జట్టులో జోఫ్రా ఆర్చర్‌కు చోటు దక్కలేదని ఈసీబీ పేర్కొంది. ఆర్చర్ ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ 2026 ఆడుతున్నప్పటికీ, రెడ్-బాల్ క్రికెట్‌లోకి తిరిగి రావడానికి అతడు ఇంకా పూర్తిగా ఫిట్‌గా లేడని ఈసీబీ భావిస్తోంది.
ఇంగ్లండ్ జట్టు:
బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, గస్ అట్కిన్సన్, సోనీ బేకర్, షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, మాథ్యూ ఫిషర్, ఎమిలియో గే, జేమ్స్ రూ, ఓలీ రాబిన్సన్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్.
షెడ్యూల్:
తొలి టెస్టు: జూన్ 4 – 8, వేదిక: లార్డ్స్
రెండో టెస్టు: జూన్ 17 – 21, వేదిక: ది ఓవల్
మూడో టెస్టు: జూన్ 25 – 29, వేదిక: ట్రెంట్ బ్రిడ్జ్
ఇవి కూడా చదవండి:
పాకిస్థాన్‌పై గెలుపు.. బంగ్లాదేశ్ ప్లేయర్లకు ఐసీసీ గుడ్ న్యూస్
సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు..