పాకిస్థాన్‌పై గెలుపు.. బంగ్లాదేశ్ ప్లేయర్లకు ఐసీసీ గుడ్ న్యూస్
ABN , Publish Date - May 13 , 2026 | 05:56 PM
పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ఐసీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. మీర్పూర్ టెస్టులో పాక్‌ను చిత్తు చేసిన తర్వాత విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బంగ్లా ప్లేయర్లు భారీగా లాభపడ్డారు.
స్పోర్ట్స్ డెస్క్: మీర్పూర్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 104 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో శాంటో విశేషంగా రాణించాడు. ఈ క్రమంలోనే పాక్‌పై ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ఐసీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బంగ్లా ప్లేయర్లు భారీగా లాభపడ్డారు. ముఖ్యంగా కెప్టెన్ నజ్ముల్ హసన్ శాంటో కెరీర్ బెస్ట్ రేటింగ్ సాధించాడు.
మీర్పూర్ టెస్టులో నజ్ముల్ హసన్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ(101), రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ(87) చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడమే కాకుండా.. ర్యాంకింగ్స్‌లో ఏకంగా 16 స్థానాలు ఎగబాకి 23వ స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం.. ఇదే స్థానంలో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ కూడా కొనసాగుతున్నాడు. అలానే ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, తొలి ఇన్నింగ్స్‌లో 1 వికెట్ తీసిన నహిద్ రాణా కూడా ర్యాంకింగ్స్‌లో భారీ జంప్ కొట్టాడు. ఒకేసారి ఐదు స్థానాలు ఎగబాకి 64వ స్థానానికి చేరుకున్నాడు. మరో ప్లేయర్ మొమినుల్ హక్ 12 స్థానాలు ఎగబాకి 35వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. అతడు ఇదే మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 91, రెండో ఇన్నింగ్స్‌లో 56 పరుగులు చేశాడు.
ముష్ఫికర్ రహీమ్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 26వ ర్యాంక్‌లో నిలిచాడు. రహీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 71, రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో 4 వికెట్లతో సత్తాచాటిన తైజుల్ ఇస్లాం మూడు స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్‌కు చేరుకోగా, తస్కిన్ అహ్మద్ 48వ స్థానంలో నిలిచాడు. ఈ టెస్ట్ బంగ్లా ప్లేయర్లకు గుడ్ న్యూస్ అందించగా.. పాక్ ప్లేయర్లకు మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. సౌద్ షకీల్, షాన్ మసూద్ ఇద్దరూ ఆరు స్థానాల చొప్పున కోల్పోయారు. 5 వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టిన మహమ్మద్ అబ్బాస్ మాత్రం 28వ స్థానానికి చేరుకుని కాస్త ఊరటనిచ్చాడు.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్ 2026: జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా
సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు..