పడిక్కల్ సెంచరీతో సుదర్శన్ స్థానానికి ఎసరు: మాజీ క్రికెటర్ శ్రీకాంత్
ABN , Publish Date - Aug 16 , 2026 | 05:21 PM
శ్రీాలంకతో జరుగుతోన్న తొలి టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత శతకంతో చెలరేగాడు. పడిక్కల్ బ్యాటింగ్‌పై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు.
స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంకతో జరుగుతూన్న తొలి టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత శతకంతో చెలరేగాడు. మూడో స్థానంలో బరిలోకి దిగిన పడిక్కల్ తొలి రోజే 131 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచి, రెండో రోజు ఏకంగా 150 పరుగుల మార్కును దాటేశాడు. చివరకు 167 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పడిక్కల్ ఔటయ్యాడు. ఇక అతడు సాధించిన ఈ భారీ శతకం వల్ల జట్టులోని మరో యువ ఆటగాడు సాయి సుదర్శన్ స్థానానికి ముప్పు ఏర్పడిందని భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
మూడో స్థానంలో నిలకడగా రాణిస్తున్న సాయి సుదర్శన్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమవడంతోనే పడిక్కల్‌కు అవకాశం దక్కింది. దీనిపై శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. 'ఇప్పుడు సాయి సుదర్శన్‌కు ఇబ్బందులు తప్పవు. గతంలో అతడు మూడో స్థానంలో బాగానే రాణించినప్పటికీ, పడిక్కల్ తన అద్భుత సెంచరీతో ఆ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఈ సమయంలో సాయి గాయం సాకుతో మ్యాచ్‌లకు దూరం కాకూడదు. ఎక్కువ క్రికెట్ ఆడుతున్నామనే నెపాలను నేను అంగీకరించను. ఆటగాళ్లు తమ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలి. ఇప్పుడున్న ఫామ్‌లో పడిక్కల్‌ను జట్టు నుంచి తొలగించలేరు. కాబట్టి సాయి పునరాగమనం అత్యంత కష్టంగా మారనుందని నేను భావిస్తున్నాను' అని శ్రీకాంత్ పేర్కొన్నాడు.
ఇదే సమయంలో పడిక్కల్ బ్యాటింగ్‌పై శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. పడిక్కల్ కవర్ డ్రైవ్‌లు, కట్ షాట్లు అద్భుతంగా ఉన్నాయని, అతని షాట్ల ఎంపికలో ఎంతో సొగసు ఉందన్నారు. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో చూపించిన అద్భుతమైన ఫామ్‌ను అతను అంతర్జాతీయ స్థాయిలోనూ కొనసాగిస్తున్నాడని కొనియాడాడు. రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీలలో రాణించిన వారికి భారత జట్టులో తగిన ప్రాధాన్యం దక్కుతుందనడానికి పడిక్కల్ ప్రదర్శనే నిదర్శనమని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.
ఇవి కూడా చదవండి:
ఆస్ట్రేలియాపై గెలుపు .. స్పందించిన బంగ్లా కెప్టెన్ నజ్ముల్
సిన్సినాటి ఓపెన్‌లో జకోవిచ్‌కు షాక్