Share News

పాల ఉత్పత్తుల కల్తీపై యూపీ సర్కార్ కఠిన చర్యలు

ABN , Publish Date - Aug 16 , 2026 | 04:42 PM

ప్రజారోగ్యం కాపాడే దిశగా యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పాలు, పాల ఉత్పత్తుల కల్తీకి పాల్పడే సంస్థలను మూసేసి, వాటి లైసెన్స్ రద్దు చేసేందుకు నిర్ణయించింది.

పాల ఉత్పత్తుల కల్తీపై యూపీ సర్కార్ కఠిన చర్యలు
CM Yogi Adityanath

ఇంటర్నెట్ డెస్క్: ప్రజారోగ్యాన్ని కాపాడే దిశగా యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పాలు, పాల ఉత్పత్తుల కల్తీకి పాల్పడే సంస్థలను మూసేసి, వాటి లైసెన్స్ రద్దు చేసేందుకు నిర్ణయించింది. ఆహార నాణ్యత నిబంధనలపై ఇటీవల ఎఫ్ఎస్‌డీఏ ఆదేశాలకు అదనంగా మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు యోగి సర్కారు నిర్ణయించింది.

గతంలో కల్తీ ఉదంతాలు బయటపడిన సందర్భాల్లో ఆయా సంస్థల్లోని శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించేవారు. కేసులు నమోదు చేసేవారు. ఇందుకు అదనంగా ఇకపై పాలు, పాల ఉత్పత్తుల్లో హానికారక పదార్థాలు, నిషేధిత కొవ్వు పదార్థాలు ఉన్నట్టు ఆరోపణలు వస్తే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 సెక్షన్ 34 ప్రకారం సంబంధిత తయారీ యూనిట్‌లో తక్షణం కార్యకలాపాలను నిలిపివేస్తారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకూడదు. ఆయా కేంద్రాల్లోని డెయిరీ ఉత్పత్తులు అన్నిటినీ సీజ్ చేస్తారు.


ఇక కల్తీ జరిగినట్టు, హానికారక పదార్థాలు ఉన్నట్టు నిర్ధారణ అయితే నిబంధనల ఉల్లంఘించిన సంస్థల లైసెన్స్‌ను రద్దు చేయడంతో పాటు ఆ బ్రాండ్ ఉత్పత్తుల విక్రయాలపై రాష్ట్రవ్యాప్త నిషేధం విధిస్తారు. పాల విక్రయాలు, పాల ఉత్పత్తుల నాణ్యత కచ్చితంగా నిబంధనలకు అనుగుణంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ డా. రోషన్ జేకబ్ స్పష్టం చేశారు.

ఇటీవల జరిగిన తనిఖీల సందర్భంగా పలు చోట్ల పాలు పాల ఉత్పత్తుల్లో నిషేధిత పదార్థాలు ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. రిఫైన్డ్ ఆయిల్, కొవ్వు, టాల్కమ్ పౌడర్, డిటర్జెంట్, టైటానియం డైయాక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటివి బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని కాపాడే దిశగా యోగి సర్కారు కఠిన చర్యలకు ఉపక్రమించింది.


ఈ వార్తలనూ చదవండి:

వందేమాతరం ఆలాపనపై వివాదం.. సోనియా గాంధీపై పోలీసులకు ఫిర్యాదు

వారణాసి ఎయిర్‌పోర్ట్‌లో పేలిన తుపాకీ.. ఇద్దరికి గాయాలు

Updated Date - Aug 16 , 2026 | 04:53 PM