Share News

ఐపీఎల్2026 నుంచి తప్పుకున్న ఇంగ్లండ్ క్రికెటర్.. వేటు తప్పదు!

ABN , Publish Date - Mar 24 , 2026 | 09:11 PM

ఇంగ్లండ్‌ క్రికెటర్‌ బెన్‌ డకెట్‌ సంచలన ప్రకటన చేశాడు. తాను ఐపీఎల్‌ 2026 టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్లు మంగళవారం వెల్లడించాడు.

ఐపీఎల్2026 నుంచి తప్పుకున్న ఇంగ్లండ్ క్రికెటర్.. వేటు తప్పదు!
Ben Duckett IPL 2026

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టైటిల్ గెలవడమే లక్ష్యంగా అన్ని జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి భారీ షాక్ తగిలిగింది. ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ డకెట్ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. గతేడాది జరిగిన ఐపీఎల్‌ మినీ వేలంలో ఢిల్లీ డకెట్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఓపెనర్‌గా పనికివస్తాడని అతడి కోసం రూ. 2 కోట్లు వెచ్చించింది.


‘ఢిల్లీ ఫ్రాంఛైజీలోని ప్రతి ఒక్కరికి నేను క్షమాపణలు చెబుతున్నా. ఈసారి ఢిల్లీ తరఫున ఆడాలని ఎంతో ఆతురతగా ఎదురుచూశాను. అందుకు తగ్గినట్లుగానే ఫ్రాంఛైజీ కూడా జట్టు కూర్పు విషయంలో ప్రణాళికలు రచించుకుంది. కానీ నా నిర్ణయం వల్ల వారి ప్రణాళికల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అందుకు నేను ఎంతగానో బాధపడుతున్నాను. అలానే ఢిల్లీ అభిమానులకు కూడా క్షమాపణలు చెబుతున్నాను' అని డకెట్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు.


'ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానంటే.. చిన్ననాటి నుంచి ఇంగ్లండ్‌ తరఫున ఆడాలని ఎన్నో కలలు కన్నాను. నా ప్రతిభ అంతా ఇంగ్లండ్‌ క్రికెట్‌ కోసమే వినియోగించాలని అనుకున్నాను. అందుకోసం నేను శారీకరంగా, మానసికంగా ఫిట్‌గా ఉండాలి. వేసవి షెడ్యూల్‌ కోసం నేను సన్నద్ధం కావాల్సి ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని డకెట్‌ తన నిర్ణయాన్ని తెలిపాడు.


కాగా ఇలా అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కారణంగా ఐపీఎల్‌లో ఆడకుండా డకెట్ పై రెండేళ్ల నిషేధం పడనుంది. బీసీసీఐ ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం.. గాయం లేదంటే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఆటగాళ్లు టోర్నీ నుంచి వైదొలిగే అవకాశం ఉంటుంది. అలాకాకుండా ఎవరి ఇష్టానికి వారు టోర్నీ నుంచి తప్పుకొంటే నిషేధం పడుతుంది. ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ ఇప్పటికే ఈ మేరకు నిషేధం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

థామస్ కప్‌2026: భారత్ జట్టుకు సారథ్యం వహించనున్న లక్ష్య సేన్

ఐపీఎల్ చరిత్రలో భారీ డీల్.. చేతులు మారిన రాజస్థాన్ రాయల్స్

Updated Date - Mar 24 , 2026 | 09:14 PM