డకెట్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన ఢిల్లీ క్యాపిటల్స్
ABN , Publish Date - Mar 25 , 2026 | 02:46 PM
ఐపీఎల్ 2026 నుంచి ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ డకెట్ తప్పుకున్న సంగతి తెలిసిందే. నిన్న ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. డకెట్ వైదొలగడంపై ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఇవాళ తొలిసారి స్పందించింది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్(IPL 2026) నుంచి ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ డకెట్ తప్పుకున్న సంగతి తెలిసిందే. నిన్న(మంగళవారం) ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అతను ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వేలంలో ఢిల్లీ డకెట్‌ను రూ.2 కోట్ల కనీస ధరకు కొనుగోలు చేసింది. ఇక డకెట్ వైదొలగడంపై ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఇవాళ(బుధవారం) తొలిసారి స్పందించింది.
బెడ్ డకెట్(Ben Duckett) తాను ఈ సీజన్‌కు అందుబాటులో ఉండడం లేదని తమకు ముందే చెప్పాడని డీసీ యాజమాన్యం పేర్కొంది. అలానే బెన్ డకెట్ స్థానంలో మరొకరి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నామని, అతడి స్థానంలో ఎవరిని తీసుకుంటామనేది త్వరలోనే వెల్లడిస్తామని చెప్పుకొచ్చింది. డకెట్ తాను వైదొలిగే విషయమై ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి ముందే చెప్పినప్పటికీ ఐపీఎల్ నియమావళి ప్రకారం అతడిపై నిషేధం పడే అవకాశం ఉందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఐపీఎల్ నిబంధనల( IPL Rules) ప్రకారం ఎవరైనా విదేశీ ఆటగాడు వేలంలో పాల్గొని, ఫ్రాంచైజీ ఎంపిక చేసుకున్న తర్వాత సరైన కారణం లేకుండా టోర్నీ నుంచి తప్పుకోకూడదు. గాయం, ఫిట్‌నెస్ సమస్యలు, పితృత్వ సెలవులకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. కానీ డకెట్ విషయంలో అలాంటి అంశాలు ఏమిలేవు. టెస్టు కెరీర్‌పై ఫోకస్ పెట్టడంతో పాటు కుటుంబంతో సమయం గడపాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ఇవి సరైన కారణాలు కాదు కాబట్టి డకెట్ పై నిషేధం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో టెస్టులపై దృష్టి సారించేందుకు డకెట్ కౌంటీల్లో నాటింగ్‌హమ్‌షైర్ తరఫున మ్యాచ్‌లు ఆడనున్నాడని సమాచారం.
ఇవి కూడా చదవండి:
ఆర్సీబీ విలువలో 0.5శాతం మా దేశ క్రికెట్‌కు ఇచ్చినా చాలు: నెదర్లాండ్స్ క్రికెటర్
టీమిండియా కంటే ఐపీఎల్‌కు జట్టును తయారుచేయడమే చాలా కష్టం: గంగూలీ