Share News

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో మార్పులు.. రోహిత్, కోహ్లీలకు షాక్.!

ABN , Publish Date - Feb 07 , 2026 | 01:18 PM

భారత క్రికెట్ నియంత్రణ మండలి 2025-26 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల వార్షిక సెంట్రల్ కాంట్రాక్టులలో భారీ మార్పులు చేసిందని సమాచారం. టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఈ కొత్త జాబితాలో డిమోషన్ లభించినట్టు తెలుస్తోంది.

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో మార్పులు.. రోహిత్, కోహ్లీలకు షాక్.!
BCCI central contracts list

స్పోర్ట్స్ డెస్క్: బీసీసీఐ(BCCI)కాంట్రాక్టుల జాబితాలో చారిత్రాత్మక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. టీమిండియా వెటరన్ బ్యాటర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్‌ కోహ్లీని(Virat Kohli) ఏ+ గ్రేడ్ నుంచి బి గ్రేడ్‌‌లోకి మార్చినట్లు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. అదేవిధంగా టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(Suryakumar Yadav) సైతం 'బి' కేటగిరిలోనే ఉన్నాడు. ఇక ఏ-కేటగిరీలో టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్‌(Shubman Gill), పేసర్ జస్‌ప్రీత్‌ బుమ్రా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఉన్నారు.


ఇప్పటికే టీ20, టెస్ట్‌ క్రికెట్ ఫార్మాట్లకు రో-కో జోడీ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వీరు ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు. ఇంతకముందు వారు ఏ+ కేటగిరీలో ఉంటూ.. బీసీసీఐ నుంచి ఏడాదికి రూ.7 కోట్ల వార్షిక వేతనం అందుకున్నారు. గ్రేడ్‌-ఏ ప్లేయర్లు రూ.5 కోట్లు, గ్రేడ్‌-బి ఆటగాళ్లు రూ.3 కోట్లు, గ్రేడ్-సి ప్లేయర్లు రూ.1 కోటి మేర అందుకుంటారు. అయితే ఇకపై ఏ+ కేటగిరీని పూర్తిగా తొలగించనున్నట్లు సమాచారం. అందుకే ఏ+ కేటగిరి వాళ్లను నేరుగా 'ఏ' గ్రేడ్‌లో ఉంచారు. అయితే కొత్త విధానంలో చెల్లింపులు ఎలా ఉంటాయనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మీడియా కథనాల ప్రకారం.. ఏయే కేటగిరీల్లో ఎవరెవరు ఉన్నారంటే.?


లిస్ట్‌లో 30 మంది పేర్లు..

గతేడాది మొత్తం 34 మంది ఆటగాళ్లను సెంట్రల్ కాంట్రాక్టుల్లో చేర్చారు. ఈ ఏడాది 30 మంది మాత్రమే ఉన్నారని తెలుస్తోంది. యువ బ్యాటర్ సాయి సుదర్శన్ తాజాగా ఈ జాబితాలో చేరగా.. ముగ్గురు ఆటగాళ్లు గ్రేడ్-ఏలో ఉండగా, 11 మంది గ్రేడ్-బిలో, 16 మంది గ్రేడ్-సిలో చోటు దక్కించుకున్నారని సమాచారం. ఈ ఒప్పందం 2025 అక్టోబర్ 1 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ఉండనుంది. అయితే ఈ విషయమై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల కాలేదు.

మీడియా నివేదికల ప్రకారం..

  • గ్రేడ్‌-A: శుభ్‌మన్‌ గిల్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా

  • గ్రేడ్‌-B: రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య, వాషింగ్టన్‌ సుందర్‌, మహ్మద్ సిరాజ్‌, రిషభ్‌ పంత్‌, కుల్దీప్‌ యాదవ్‌, యశస్వి జైస్వాల్‌, శ్రేయస్‌ అయ్యర్‌

  • గ్రేడ్‌-C: అక్షర్‌ పటేల్‌, తిలక్‌ వర్మ, శివమ్‌ దూబె, రింకు సింగ్‌, ధ్రువ్‌ జురేల్‌, సాయి సుదర్శన్‌, హర్షిత్‌ రాణా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, వరుణ్‌ చక్రవర్తి, అభిషేక్‌ శర్మ, రవి బిష్ణోయ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌


ఇవీ కూడా చదవండి:

అండర్-19 ప్రపంచ కప్ విజేత భారత్

టీ20 ప్రపంచకప్‌ వేళ గూగుల్ ప్రత్యేక డూడుల్‌..

Updated Date - Feb 07 , 2026 | 02:04 PM