Share News

ఓడినప్పటికీ చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ బౌలర్

ABN , Publish Date - Aug 24 , 2026 | 11:25 AM

ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో బంగ్లాదేశ్ భారీ ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ.. ఆ జట్టు పేసర్ షోరిఫుల్ ఇస్లామ్ అరుదైన రికార్డు సాధించాడు. 140 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఆస్ట్రేలియాపై ఒక ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టిన తొలి ఎడమచేతి వాటం పేసర్‌గా నిలిచాడు.

ఓడినప్పటికీ చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ బౌలర్
Shoriful Islam seven wickets

స్పోర్ట్స్ డెస్క్: మోకే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో బంగ్లా ఓటమి పాలైంది. ఇదే సమయంలో ఆ జట్టు ఎడమచేతి వాటం పేసర్ షోరిఫుల్ ఇస్లామ్ అరుదైన రికార్డు సాధించాడు. అద్భుత బౌలింగ్‌తో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ లైనప్‌ను షోరిఫుల్ దెబ్బ తీశాడు. ఈ పేసర్ 15 ఓవర్లలో 48 పరుగులే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. దీంతో 140 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో కంగారు జట్టుపై ఒక ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన తొలి ఎడమ చేతి వాట పేసర్‌గా షోరిఫుల్ నిలిచాడు.


గతంలో ఇంగ్లండ్‌కు చెందిన ఎడమ చేతి వాటం పేసర్ డిక్ బార్లో ఆస్ట్రేలియాపై టెస్టు ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీశాడు. 1886లో మాంచెస్టర్‌లో జరిగిన టెస్టులో బార్లో 44 పరుగులే ఇచ్చి.. 7 వికెట్లు సాధించాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఏ ఎడమచేతి వాటం పేసర్ కూడా ఆస్ట్రేలియాపై ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లను సాధించలేదు. 140 ఏళ్ల తర్వాత తాజాగా షోరిఫుల్ ఇస్లామ్ ఆ అరుదైన ఫీట్‌ను సాధించాడు.


అయితే ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకం మాత్రం ఇంగ్లండ్ దిగ్గజం జిమ్ లేకర్ పేరిట ఉంది. 1956 జూలైలో మాంచెస్టర్‌లో జరిగిన టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో లేకర్ మొత్తం 10 మంది కంగారు బ్యాటర్లను కేవలం 53 పరుగులకే ఔట్ చేశాడు. మరోవైపు షోరిఫుల్ అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ రెండో టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో బంగ్లా దారుణ ఓటమిని చవిచూసింది. దీంతో రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్ 1-1తో ముగిసింది.


ఇవి కూడా చదవండి:

కుల్దీప్‌ యాదవ్‌ గైర్హాజరీపై క్లారిటీ ఇచ్చిన కోటక్!

నైట్‌క్లబ్ ఘటనలో ఇంగ్లండ్ స్టార్ బౌలర్‌కు సంకెళ్లు.. అక్కడే బెన్ స్టోక్స్!

Updated Date - Aug 24 , 2026 | 11:40 AM