Share News

దేవ్‌దత్‌ ధమాకా

ABN , Publish Date - Aug 24 , 2026 | 06:32 AM

శ్రీలంకతో రెండో టెస్టును కూడా భారత్‌ ఆశాజనకంగా ప్రారంభించింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ దేవ్‌దత్‌ పడిక్కళ్‌ (117) మరోసారి తన సత్తా చాటుకున్నాడు. ఆదివారం తొలి రోజు ఆటలోనే శతకంతో...

దేవ్‌దత్‌ ధమాకా

  • వరుసగా రెండో శతకం

  • భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 300/5

  • గిల్‌ హాఫ్‌ సెంచరీ

  • శ్రీలంకతో రెండో టెస్టు

8 ఏళ్ల తర్వాత భారత్‌ తరఫున విదేశాల్లో రెండు వరుస టెస్టు సెంచరీలు సాధించిన వన్‌డౌన్‌ బ్యాటర్‌గా దేవ్‌దత్‌ నిలిచాడు. 2018 ఆసీస్‌ పర్యటనలో పుజార ఈ ఫీట్‌ సాధించాడు.

కొలంబో: శ్రీలంకతో రెండో టెస్టును కూడా భారత్‌ ఆశాజనకంగా ప్రారంభించింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ దేవ్‌దత్‌ పడిక్కళ్‌ (117) మరోసారి తన సత్తా చాటుకున్నాడు. ఆదివారం తొలి రోజు ఆటలోనే శతకంతో మురిపించాడు. గాలె టెస్టులోనూ పడిక్కళ్‌ భారీ శతకం సాధించిన విషయం తెలిసిందే. అలాగే కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (50) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకోగా.. ఆట ముగిసేసరికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 300/5 స్కోరుతో పటిష్టంగా నిలిచింది. ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ (45), రవీంద్ర జడేజా (43) ఫర్వాలేదనిపించారు. క్రీజులో ధ్రువ్‌ జురెల్‌ (7)తో పాటు కుల్దీప్‌ స్థానంలో చోటు దక్కించుకున్న అరంగేట్ర ఆఫ్‌ స్పిన్నర్‌ సారాంశ్‌ జైన్‌ (4 బ్యాటింగ్‌) ఉన్నాడు. అటు లంక పేసర్‌ అసిత ఫెర్నాండో మూడు వికెట్లతో భారత్‌ను ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేశాడు.

ఆరంభంలో ఆచితూచి...: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న భారత్‌ తొలి సెషన్‌లో జాగ్రత్తగా ఆడింది. పిచ్‌ పేస్‌కు అనుకూలించడంతో లంక బౌలర్లు రెండు వికెట్లు తీసి భారత్‌పై ఒత్తిడి పెంచగలిగారు. అయితే ఓపెనర్‌ రాహుల్‌ (18) తడబడినా.. జైస్వాల్‌ మాత్రం దీటుగా ఆడాడు. దూకుడుగా ఆడే ప్రయత్నంలో రాహుల్‌.. కీపర్‌ డిక్‌వెల్లాకు క్యాచ్‌ ఇచ్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన దేవ్‌దత్‌కు అదృష్టం కూడా కలిసివచ్చింది. 0, 1 పరుగు దగ్గర అతనిచ్చిన కాస్త క్లిష్టమైన క్యాచ్‌లను ఫీల్డర్లు అందుకోలేకపోయారు. ఇక 17వ ఓవర్‌లో మూడు ఫోర్లు బాదిన జైస్వాల్‌ ఆ తర్వాత బౌల్డయ్యాడు. 88/2 స్కోరుతో జట్టు తొలి సెషన్‌ను ముగించింది.


దేవ్‌దత్‌-గిల్‌ భాగస్వామ్యం: లంచ్‌ బ్రేక్‌ తర్వాత దేవ్‌దత్‌-గిల్‌ జోడీ లంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. ముఖ్యంగా పడిక్కళ్‌ తన సూపర్‌ ఫామ్‌ను ఈసారి కూడా ప్రదర్శించాడు. క్లాసిక్‌ షాట్లతో మైదానం నలువైపులా బంతిని పంపాడు. అటు గిల్‌ సైతం ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ సాగించాడు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్‌ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. లెఫ్టామ్‌ స్పిన్నర్‌ ప్రభాత్‌ జయసూర్యను సైతం గిల్‌ దీటుగానే ఆడాడు. అయితే రెండో సెషన్‌ చివరి ఓవర్‌లో ఓ పేలవ షాట్‌కు గిల్‌ వెనుదిరిగాడు. పేసర్‌ అసిత ఈ వికెట్‌ తీయడంతో మూడో వికెట్‌కు 120 పరుగుల భారీ భాగస్వామ్యానికి అడ్డుకట్ట పడింది.

పంత్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా..: చివరి సెషన్‌లో ఆరంభంలోనే రిషభ్‌ పంత్‌ (3) రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. లాహిరు కుమార వేసిన ఇన్నింగ్స్‌ 58వ ఓవర్‌లో బంతి అతడి మోచేతికి బలంగా తాకింది. ఫిజియో చికిత్స చేసినా నొప్పి ఎక్కువగా ఉండడంతో మైదానం వీడాడు. ఇక దేవ్‌దత్‌కు జడేజా చక్కటి సహకారం అందించడంతో భారత్‌ భారీ స్కోరు దిశగా సాగింది. జడ్డూ అడపాదడపా ఫోర్లతో ఆకట్టుకోగా.. అటు దేవ్‌దత్‌ 70వ ఓవర్‌లో రెండు ఫోర్లు బాది శతకం పూర్తి చేశాడు. అయితే కాసేపటికే అతడిని స్పిన్నర్‌ కేశర బౌల్డ్‌ చేశాడు. దీంతో నాలుగో వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరోవైపు అధిక వేడి, తేమతో జడేజా ఇబ్బందిపడినట్టు కనిపించింది. అలాగే చేతి కండరాలు పట్టేయడంతో ఫిజియోతో చికిత్స చేయించుకున్నాడు. ఇక తొలి రోజు ఆఖరి ఓవర్‌ తొలి బంతికి జడ్డూను అసిత అవుట్‌ చేయడంతో భారత్‌ ఐదో వికెట్‌ను కోల్పోయింది.

స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (బి) అసిత 45, రాహుల్‌ (సి) డిక్‌వెల్లా (బి) లాహిరు కుమార 18, దేవ్‌దత్‌ (బి) కేశర 117, గిల్‌ (సి) డిక్‌వెల్లా (బి) అసిత 50, పంత్‌ (రిటైర్డ్‌ హర్ట్‌) 3, జడేజా (బి) అసిత 43, జురెల్‌ (బ్యాటింగ్‌) 7, సారాంశ్‌ (బ్యాటింగ్‌) 4; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 85 ఓవర్లలో 300/5; వికెట్ల పతనం: 1-37, 2-66, 3-186, 3-207 (పంత్‌-రిటైర్డ్‌ నాటౌట్‌), 4-281, 5-296. బౌలింగ్‌: అసిత 16-5-46-3, లాహిరు కుమార 13-4-38-1, ప్రభాత్‌ 27-4-90-1, కేశర 22-0-93-1, సోనాల్‌ 1-0-2-0, ధనంజయ 2-0-8-0, కమిల్‌ మిషార 4-0-16-0.

ఈ వార్తలనూ చదవండి:

అమెరికాలో భారతీయ వ్యాపారి హత్య.. నిందితుడి చిత్రాలు విడుదల..

అమెరికా ఒత్తిడికి తలవంచబోం.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు..

Updated Date - Aug 24 , 2026 | 06:32 AM