Share News

నైట్‌క్లబ్ ఘటనలో ఇంగ్లండ్ స్టార్ బౌలర్‌కు సంకెళ్లు.. అక్కడే బెన్ స్టోక్స్!

ABN , Publish Date - Aug 24 , 2026 | 07:50 AM

ఇంగ్లండ్ ఆటగాళ్లను మరోసారి ఆఫ్‌ఫీల్డ్ వివాదం వెంటాడుతోంది. ఇంగ్లండ్ స్టార్‌ ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్స్ డెర్బీలోని ఓ నైట్‌క్లబ్ వెలుపల పోలీసుల చేతికి చిక్కినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నైట్‌క్లబ్ ఘటనలో ఇంగ్లండ్ స్టార్ బౌలర్‌కు సంకెళ్లు.. అక్కడే బెన్ స్టోక్స్!
Brydon Carse

స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లండ్ ఆటగాళ్లు తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటారు. గతంలో నైట్ క్లబ్ గొడవలో ఇంగ్లీష్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ చిక్కుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇంగ్లండ్ స్టార్‌ బౌలర్ బ్రైడన్ కార్స్ కు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. అతడిని డెర్బీలోని ఓ నైట్‌క్లబ్ వెలుపల పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వీడియోలో కార్స్ చేతులకు వెనుకకు సంకెళ్లు వేసి, పోలీసు అధికారులు అతడిని చుట్టుముట్టి ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే కార్స్‌ను అరెస్టు చేయలేదని, ఎలాంటి అభియోగాలు నమోదు చేయకుండానే విడుదల చేసినట్లు సమాచారం. డర్హామ్ జట్టు తరఫున కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఆడిన అనంతరం జట్టు సభ్యులు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కూడా అక్కడే కనిపించడం మరింత చర్చకు దారితీసింది. డర్హామ్ జట్టు తరఫున అదే మ్యాచ్‌లో ఆడిన స్టోక్స్.. డెర్బీషైర్‌పై జట్టు ఘన విజయంలో కీలక పాత్ర పోషించాడు.


అయితే నైట్‌క్లబ్‌లో జరిగిన ఘటన ఇంగ్లండ్ జట్టు అధికారిక కార్యక్రమంలో భాగం కాదని తెలుస్తోంది. దీనిపై ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు స్పందిస్తూ.. డెర్బీలో జరిగినట్లు సమాచారం అందిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు కార్స్‌పై తదుపరి చర్యల విషయమై స్పష్టత వచ్చే అవకాశం లేదు. మొత్తంగా ప్రస్తుతం కార్స్‌పై ఎలాంటి క్రిమినల్ అభియోగాలు లేవు. పోలీసులు అతడిని ఘటనాస్థలంలో తాత్కాలికంగా అదుపులోకి తీసుకుని అనంతరం విడుదల చేసినట్లు స్థానిక రిపోర్టులు పేర్కొంటున్నాయి.


ఇవి కూడా చదవండి:

జైస్వాల్, ఫెర్నాండో గొడవపై స్పందించిన భారత్ కోచ్

దేవ్‌దత్‌ ధమాకా

Updated Date - Aug 24 , 2026 | 08:50 AM