పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఊహించని షాకిచ్చిన బంగ్లాదేశ్
ABN , Publish Date - Apr 24 , 2026 | 02:34 PM
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో కొనసాగేందుకు తమ ఇద్దరు ప్రధాన ఆటగాళ్లకు ఇచ్చిన నిరభ్యంతర పత్రాల్ని రద్దు చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సమయంలో పాకిస్థాన్(Pakistan), బంగ్లాదేశ్ చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరికొసం మరొకరం అన్నట్లు ఇరుదేశాలు ప్రవర్తించాయి. పాకిస్థాన్ మాయ ఉచ్చులో పడి.. బంగ్లాదేశ్ తీవ్రంగా నష్టపోయింది. ఆ తర్వాత కూడా పాకిస్థాన్‌కు పలు సందర్భాల్లో మద్దతుగా బంగ్లాదేశ్ ఉంది. అయితే తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు షాకిస్తూ.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో కొనసాగేందుకు తమ ఇద్దరు ప్రధాన ఆటగాళ్లకు ఇచ్చిన నిరభ్యంతర పత్రాల్ని (NOC) రద్దు చేసింది.
ఐపీఎల్-2026 నుంచి తొలగించిన తర్వాత బంగ్లా ఫాస్ట్‌బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ పీఎస్‌ఎల్ 2026లో చేరిన సంగతి తెలిసిందే. లాహోర్ ఖలందర్స్ తరఫున ఆడతున్న ముస్తాఫిజుర్.. ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే, స్వదేశంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోసం ముస్తాఫిజుర్‌ను బీసీబీ వెనక్కి పిలిపించింది. కానీ గాయం వల్ల అతడు తొలి రెండు వన్డేలకు దూరం కాగా.. ఆఖరిదైన నిర్ణయాత్మక మూడో వన్డేలో బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్ తర్వాత బీసీబీ కీలక ప్రకటన చేసింది. పీఎస్‌ఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లకు ముస్తాఫిజుర్ రహ్మాన్ ను పంపబోమని తెలిపింది. ఫిట్‌నెస్ సమస్యల భయం దృష్ట్యా అతడికి ఇచ్చిన ఎన్వోసీని రద్దు చేస్తున్నట్లు పీసీబీకి సమాచారం ఇచ్చింది.
ఇక ముస్తాఫిజుర్‌తో పాటు మరో పేసర్ నహీద్ రాణా ఎన్వోసీని కూడా బీసీబీ రద్దు చేయడం గమనార్హం. అతడు పీఎస్‌ఎల్ 2026లో పెషావర్ జెల్మీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వన్డే సిరీస్ ఆడేందుకు నహీద్ స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఏదేమైనా పీఎస్‌ఎల్‌లో తమదైన ముద్రవేస్తూ లీగ్‌కు కాస్త ఊపు తెచ్చిన ఇద్దరు ప్లేయర్లను కీలక సమయంలో తప్పించడం ద్వారా బీసీబీ.. పీసీబీకి దిమ్మతిరిగేలా షాకిచ్చిందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
సీఎస్కే చేతిలో ఘోర ఓటమిపై స్పందించిన హార్దిక్
మెరుపు సెంచరీ.. సంజు ఖాతాలోకి పలు రికార్డులు!