Share News

అఫ్గాన్‌పై దాడి.. ఆసీస్ ప్లేయర్లకు కీలక వార్నింగ్!

ABN , Publish Date - Mar 17 , 2026 | 07:43 PM

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లోని ఒక ఆసుపత్రిపై పాకిస్థాన్‌ వైమానిక దాడులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ దాడి నేపథ్యంలో మార్చి 26 నుంచి ప్రారంభం కావాల్సినన పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ 2026 సందిగ్ధంలో పడింది.

అఫ్గాన్‌పై దాడి.. ఆసీస్ ప్లేయర్లకు కీలక వార్నింగ్!
Australia Imposes Conditions

స్పోర్ట్స్ డెస్క్: అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లోని ఒక ఆసుపత్రిపై పాకిస్థాన్‌ వైమానిక దాడులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో దాదాపు 400 మంది చనిపోగా, మరో 250 మంది గాయపడినట్లు సమాచారం. ఈ దాడి నేపథ్యంలో మార్చి 26 నుంచి ప్రారంభం కావాల్సిన పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌) 2026 సందిగ్ధంలో పడింది. పీఎస్ఎల్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, మార్నస్‌ లబుషేన్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ సహా చాలా మంది ఈ టోర్నీలో పాల్గొనాల్సి ఉంది. అలానే టిమ్ పైన్, జేసన్ గిల్లెస్పీ వంటి ఆస్ట్రేలియా కోచ్‌లు కూడా ఈ లీగ్‌లో భాగంగా ఉన్నారు. తాజాగా.. ఆసీస్‌ ఆటగాళ్లు పీఎస్‌ఎల్‌లో పాల్గొనేందుకు ఆ దేశ క్రికెట్‌ బోర్డు కొన్ని షరతుల మీద అనుమతి ఇచ్చింది.


పెషావర్‌ జాల్మీ పేరుతో పీఎస్‌ఎల్‌లో ఒక జట్టు ఉండటంతో అక్కడ కూడా మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే పాక్‌ - అఫ్గాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా పెషావర్‌ ప్రస్తుతం ‘నో ట్రావెల్‌ జోన్‌’లో ఉంది. ఈ కారణంగానే ఒకవేళ మ్యాచ్‌లు ఆడేందుకు పెషావర్‌కు వెళ్తే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశముందని ఆసీస్‌ క్రికెట్‌ బోర్డు ఆందోళన చెందుతోంది. అందుకే అఫ్గానిస్థాన్‌ సరిహద్దుకు సమీపంలో ఉండే పెషావర్‌కు దూరంగా ఉండాలని తెలిపింది. కాగా.. మార్చి 28న పెషావర్‌ జాల్మీ, రావల్పిండి మధ్య జరగనున్న మ్యాచ్‌కు పెషావర్‌‌లోని ఇమ్రాన్ ఖాన్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.


రెండు జట్లలోనూ ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉన్నారు. ఆరోన్ హార్డీ జల్మీ జట్టులో ఉండగా, జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్‌ను రావల్పిండి జట్టు ఎంపిక చేసింది. అంతేకాకుండా.. ఒకవేళ ఏదైనా భద్రతా సమస్యలు తలెత్తినా ఆటగాళ్లను ప్రత్యేక ఫ్లైట్లో తరలించేందుకు సిద్ధంగా ఉంటామని పీఎస్‌ఎల్‌ నిర్వాహకులు ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డుకు హామీ ఇచ్చినట్లు సమాచారం. కాగా ఐపీఎల్‌ 2026 సీజన్‌ ప్రారంభానికి రెండు రోజుల మందు మార్చి 26న పీఎస్‌ఎల్‌ సీజన్‌కు తెరలేవనుంది. మరోవైపు పీఎస్ఎల్ 11వ ఎడిషన్‌లో నిర్వహించిన తొలి వేలం నుంచి ఆఫ్గానిస్థాన్ ఆటగాళ్లు తమ పేర్లను ఉపసంహరించుకున్నారు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్‌లో ఇంకా కలగానే ఆ ఆటగాళ్ల కోరిక!

NZ vs SA: సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం

Updated Date - Mar 17 , 2026 | 08:30 PM