స్కోరు కార్డులో వింత పేర్లు.. టీమిండియాలో టీటీవీ నంబూరి.. ఎవరంటే?
ABN , Publish Date - Oct 03 , 2026 | 02:52 PM
ఆసియా క్రీడలు 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శన కంటే బ్రాడ్‌కాస్టర్ చూపించిన స్కోర్ బోర్డు గ్రాఫిక్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి.
స్పోర్ట్స్ డెస్క్: ఆసియా క్రీడలు 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శన కంటే బ్రాడ్‌కాస్టర్ చూపించిన స్కోర్ బోర్డు గ్రాఫిక్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. సాధారణంగా క్రికెట్ ప్రపంచంలో సుపరిచితమైన పేర్లతో కనిపించే ఆటగాళ్లు ఈ టోర్నీలో మాత్రం పూర్తిగా కొత్త పేర్లతో కనిపించారు. టీటీవీ నంబూరి, ఎస్ విశ్వనాథ్ వంటి కొత్త పేర్లతో టీమిండియా ఆటగాళ్లు దర్శనమిచ్చారు. మరి.. ఆసియా క్రీడల్లో జరిగిన ఈ విచిత్రం వెనుక అసలు స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...
పాకిస్థాన్‌తో జరిగిన తుది పోరులో భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ పేరు స్క్రీన్‌పై టీటీవీ నంబూరిగా కనిపించింది. దీంతో క్రికెట్ అభిమానులు కాసేపు గందరగోళానికి గురయ్యారు. అసలు ఈ కొత్త ప్లేయర్ ఎవరా అంటూ రకరకాల ప్రశ్నలు లేవనెత్తారు. ఆసియా క్రీడల నిబంధనల ప్రకారం పాస్ పోర్టు లేదా అధికారిక రిజిస్ట్రేషన్ పేర్లను స్కోర్ బోర్డుపై ప్రదర్శించాలి. ఈ నిబంధనల కారణంగానే క్రికెట్ అభిమానుల్లో గందరగోళం తలెత్తింది. తిలక్ వర్మ పూర్తి పేరు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ కావడంతో ఆ విధంగా ప్రదర్శించారు.
అలానే మరికొందరి పేర్లను కూడా ఇలాగే భిన్నంగా ప్రదర్శించారు. వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ పేరు ఎస్ విశ్వనాథ్, వాషింగ్టన్ సుందర్ పేరును డబ్ల్యూఎస్ మణి సుందర్ వాషింగ్టన్ సుందర్‌గా స్కోర్ బోర్డుపై కనిపించాయి. అలానే జె.జె. బుమ్రా, ఎస్.ఎస్. అయ్యర్, ఐ. కిషన్, ఎస్.ఆర్. దూబే, ఎ.ఆర్. పటేల్ పేరు కూడా కాస్త భిన్నంగా స్కోర్ బోర్డుపై కనిపించాయి. మరోవైపు టీటీవీ నంబూరి మరోసారి పాకిస్థాన్‌పై విరుచకపడ్డాడు. నాలుగు సిక్సర్లు, మూడు ఫోర్లతో 22 బంతుల్లో అజేయంగా 51 పరుగులు చేశాడు.
పాక్‌తో జరిగిన తుదిపోరులో భారత్ 19 పరుగుల తేడాతో విజయం సాధించి.. స్వర్ణం కైవసం చేసుకుంది. మొత్తంగా మైదానంలో ఆటగాళ్ల మెరుపు ఇన్నింగ్స్‌ల కంటే సోషల్ మీడియాలో ఈ పేర్ల మార్పు గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. అభిమానులు ఈ విచిత్రమైన పేర్లను స్క్రీన్‌షాట్లు తీసి ఫన్నీ కామెంట్లు, మీమ్స్‌తో తెగ ట్రెండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఆసియా క్రికెట్: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. పాక్‌పై భారత్ విజయం
పాక్‌తో మ్యాచ్‌లో హ్యాండ్‌షేక్‌కు దూరంగా భారత్.. ఎందుకిలా.?