Share News

నాన్‌వెజ్ టీ తాగుతున్నట్లు క్రికెటర్లకు తెలుసా?.. ఎంసీఏపై బాంబే హైకోర్టు ఆగ్రహం

ABN , Publish Date - Aug 25 , 2026 | 06:52 PM

ముంబై క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఐదు రెస్టారంట్ల లైసెన్సులను మహారాష్ట్ర ఎఫ్‌డీఏ నిలిపేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై మంగళవారం బాంబే హైకోర్టు విచారణ జరిపింది.

నాన్‌వెజ్ టీ తాగుతున్నట్లు క్రికెటర్లకు తెలుసా?.. ఎంసీఏపై బాంబే హైకోర్టు ఆగ్రహం
Bombay High Court

ఇంటర్నెట్ డెస్క్: ముంబై క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఐదు రెస్టారంట్ల లైసెన్సులను మహారాష్ట్ర ఎఫ్‌డీఏ నిలిపేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై మంగళవారం బాంబే హైకోర్టు విచారణ జరిపింది. ఎంసీఏ ప్రాంగణంలోని ఫుడ్‌ ఔట్‌లెట్లకు సంబంధించి బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంసీఏ పరిధిలో ఉన్న రెస్టారంట్లను మహారాష్ట్ర ఎఫ్‌డీఏ మరోసారి తనిఖీ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 29కి వాయిదా వేసింది.


ఎంసీఏ తరఫున సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌ నాంకానీ.. త్వరలో జరగనున్న బ్యాడ్మింటన్‌ మ్యాచ్‌లను దృష్టిలో పెట్టుకుని కనీసం టీ, కాఫీ అందించేందుకు తాత్కాలిక అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ సందర్భంగా ఆయన ‘క్రికెటర్లు టీ, వడాపావ్‌ కోసం బయటకు వెళ్లాల్సి వస్తుంది’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఘుగే ఆసక్తికరంగా స్పందించారు. ‘ఈగలు, బొద్దింకల కారణంగా టీ కూడా నాన్‌వెజ్‌గా మారుతోంది. నాన్‌వెజ్ టీ తాగుతున్నారని క్రికెటర్లకు తెలుసా?’ అంటూ ప్రశ్నించారు.


ఎంసీఏ పేరుతో ఫుడ్‌ లైసెన్సులు జారీ అయినప్పటికీ.. ఆయా ఔట్‌లెట్లను షిర్కే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అనే సంస్థ నిర్వహిస్తోందని ఎఫ్‌డీఏ కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 27 (గురువారం) మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఔట్‌లెట్లను మరోసారి తనిఖీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. తనిఖీల్లో అన్ని నిబంధనలు పాటిస్తున్నట్లు తేలితే.. సాయంత్రం 6 గంటలకే సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని స్పష్టం చేసింది.


టీ, కాఫీకి మాత్రమే అనుమతి

తుది నిర్ణయం వెలువడే వరకు ఔట్‌లెట్లలో ఆటోమేటెడ్‌ టీ, కాఫీ వెండింగ్‌ మెషీన్లను నిర్వహించేందుకు కోర్టు అనుమతించింది. అయితే మెషీన్ల ద్వారా అందించే టీ, కాఫీ మినహా మరే ఇతర ఆహార కార్యకలాపాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఎఫ్‌డీఏ అధికారులు సమర్పించిన తనిఖీ నివేదికల ఫార్మాట్‌పై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సాధారణంగా ఆటోమేటెడ్‌ నివేదికల్లో ఉండే స్కోరింగ్‌ విధానం తాజా నివేదికల్లో కనిపించకపోవడాన్ని ప్రశ్నించింది. దీంతో తాజా తనిఖీ నివేదికల్లో సరైన స్కోర్‌ను నమోదు చేయాలని ఎఫ్‌డీఏను ఆదేశించింది.


ఇవి కూడా చదవండి:

భారత్-శ్రీలంక టెస్టు: మూడో రోజు ముగిసిన ఆట

అంపైర్లతో గొడవ.. శ్రీలంక బౌలర్ ప్రభాత్ జయసూర్యపై ఐసీసీ చర్యలు

Updated Date - Aug 25 , 2026 | 07:13 PM